
నేపాల్ శుభారంభం
హాంకాంగ్‌పై విజయం
చిట్టగాంగ్: తొలిసారిగా టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపాల్ జట్టు ఆ క్రమంలో తొలి విజయాన్ని అందుకుంది. జహూర్ అహ్మద్ చౌదురి మైదానంలో హాంకాంగ్ జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ అర్హత మ్యాచ్‌లో నేపాల్ 80 పరుగుల తేడాతో నెగ్గింది.
జ్ఞానేంద్ర మల్లా (41 బంతుల్లో 48; 4 ఫోర్లు), పరస్ ఖడ్కా (37 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించడంతో... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 149 పరుగులు సాధించింది. వేగంగా ఆడే క్రమంలో 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా... ఖడ్కా, మల్లా కలిసి జట్టు స్కోరును పెంచారు. సమయోచితంగా ఆడుతూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్‌లో నేపాల్ ఆటగాళ్లు వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయారు. ఇందులో రెండు రనౌట్లున్నాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.
స్పిన్నర్లు శక్తి గౌచన్ (3/9), రెజ్మీ (3/14) బంతులకు హాంకాంగ్ బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఫలితంగా 17 ఓవర్లలోనే 69 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బాబర్ హయత్ (25 బంతుల్లో 20; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 11 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కూలాయి. ఇరు జట్ల ఆటగాళ్లందరికీ ఇదే తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్.