సాక్షి, న్యూఢిల్లీ: మైదానంలోనే కాదు సామాజిక అంశాల్లోనూ చురుకుగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అందుకు కారణంగా కేరళలో మతి స్థిమితం లేని ఆదివాసి మధు కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే. మధు తల్లికి లక్షా యాభైవేల రూపాయల చెక్ అందించి తనది పెద్ద మనసు అని నిరూపించుకున్నాడు. ఆహారం చోరీ చేశాడని ఆరోపిస్తూ ఆగ్రహించిన కొందరు యువకులు విచక్షణారహితంగా చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధు అనంతరం చనిపోయాడు.
ఇటీవల మధు తల్లి మల్లి పేరుతో ఇండస్ ఇండ్ బ్యాంకు చెక్కు సెహ్వాగ్ అందించాడని, అతడి మనసు పెద్దదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో బ్యాటింగ్‌లోనే కాదు.. బాధితులను ఆదుకోవడంలోనూ సెహ్వాగ్ ముందుంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మధు హత్య ఘటనలో పోలీసులు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కాగా, ఉబెయిద్, హుస్సేన్, అబ్ధుల్ కరీం అని నిందితులలో కొందరు పేర్లను ఇటీవల తన ట్వీట్‌లో సెహ్వాగ్ ప్రస్తావించాడు. మధు హత్యపై స్పందిస్తూ.. 'మనం సిగ్గుతో తల దించుకోవాలి. ఈ ఘటనపై క్షమాపణ చెబుతున్నాను. ట్వీట్ మతానికి సంబంధించినది కాదు. హింసాత్మక ప్రవృత్తిలో ఐక్యంగా ఉంటున్నారు. శాంతంగా ఉండాలని' సెహ్వాగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment