
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత మహిళలు పరాజయం పాలయ్యారు. భారత్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మహిళలు ఆఖరి బంతికి ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించారు. దాంతో ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను న్యూజిలాండ్ మహిళలు 2-0తో కైవసం చేసుకున్నారు. న్యూజిలాండ్ క్రీడాకారిణుల్లో సుజీ బేట్స్(62) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమెకు జతగా అమీ సాటర్‌వైట్(23) ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుకుంది.
అంతకుముందు టాస్ ఓడిన భారత మహిళలు తొలుత బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్‌లో జెమీమా రోడ్రిగ్స్(72) హాఫ్ సెంచరీ సాధించగా, స్మృతీ మంధాన(36) మోస్తరుగా రాణించారు. వీరిద్దరూ మినహా మిగతా వారు విఫలం కావడంతో భారత్ సాధారణ లక్ష్యాన్ని మాత్రమే కివీస్ ముందుంచింది. ఆపై లక్ష్య ఛేదనలో కివీస్ 33 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఓపెనర్ సోఫీ డివైన్(19) మొదటి వికెట్‌గా పెవిలియన్‌కు చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో కాట్లిన్ గుర్రే(4) వికెట్‌ను చేజార్చుకుంది.
ఆ తరుణంలో సుజీ బేట్స్-సాట్‌ర్‌వైట్ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయం పథంలో నడిపించింది. ఇక చివర్లో కివీస్ వరుసగా రెండు వికెట్లు చేజార్చుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్‌కు కివీస్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరం కాగా, తొలి బంతిని కేటీ మార్టిన్ ఫోర్ కొట్టారు. ఆపై మిగతా పనిని కాస్పరెక్(4 నాటౌట్), హనాహ్ రోవ్(4 నాటౌట్)లు పూర్తి చేసి జట్టుకు విజయం చేకూర్చారు. నామమాత్రమైన మూడో టీ20 ఆదివారం జరుగనుంది.