వెల్లింగ్టన్: తొలి రెండు రోజులు వర్షం కారణంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యం కాకపోయినా... తర్వాతి మూడు రోజుల్లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో నెగ్గింది. చివరిదైన మూడో టెస్టు ఈనెల 16న క్రైస్ట్‌చర్చ్‌లో మొదలవుతుంది. 223 పరుగులతో వెనుకబడి... ఓవర్‌నైట్ స్కోరు 80/3తో మ్యాచ్ చివరి రోజు మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 56 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.
కెప్టెన్ మహ్ముదుల్లా (69 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ పేస్ బౌలర్లు నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తమ స్వింగ్, బౌన్స్‌తో హడలెత్తించారు. వాగ్నర్ 45 పరుగులిచ్చి 5 వికెట్లు... బౌల్ట్ 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. డబుల్ సెంచరీ చేసిన కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. తాజా సిరీస్ విజయంతో న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంతో సీజన్‌ను ముగించనుంది. ఫలితంగా ఆ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 48 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది. టాప్ ర్యాంక్‌లో భారత జట్టు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment