దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్, గ్రాండ్‌హోమ్
ప్రపంచ కప్‌లో అత్యంత ఉత్కంఠభరిత పోరుకు అద్భుత ముగింపు లభించింది. భారీ స్కోర్లు లేకపోయినా, పరుగుల వరద పారకపోయినా హోరాహోరీ సమరం ప్రేక్షకులను కట్టిపడేసింది. చివరకు ఈ సమయంలో సఫారీలపై కివీస్‌దే పైచేయి అయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ముందుండి నడిపించగా న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయం సాధించింది. 2011, 2015 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఇప్పుడు కూడా అదే జట్టు చేతిలో ఓడి టోర్నీలో తమ సెమీస్ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది. 242 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఒక దశలో కివీస్ తడబడ్డా... విలియమ్సన్, గ్రాండ్‌హోమ్ ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించి విజయానికి చేరువగా తెచ్చారు. చివరి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన స్థితిలో 11 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. ఈ దశలో విలియమ్సన్ తన క్లాస్, మాస్ కలగలిసిన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. చివరి ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్‌తో స్కోరు సమం చేసి సెంచరీ అందుకున్న కెప్టెన్ తర్వాతి బంతికి మ్యాచ్‌ను ముగించాడు.
బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అజేయ యాత్ర కొనసాగింది. బుధవారం ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో ఒక ఓవర్‌ను తగ్గించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. డసెన్ (64 బంతుల్లో 67 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆమ్లా (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం న్యూజిలాండ్ 48.3 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ విలియమ్సన్ (138 బంతుల్లో 106 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగగా, గ్రాండ్‌హోమ్ (47 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు...
టోర్నీలో వరుసగా విఫలమవుతున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి దూకుడు కనబర్చడంలో విఫలమైంది. బౌల్ట్ తన తొలి ఓవర్లోనే డి కాక్ (5)ను బౌల్డ్ చేసి సఫారీలను దెబ్బ తీశాడు. ఈ దశలో ఆమ్లా, డు ప్లెసిస్ (23) కలిసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడే ప్రయత్నంలో పరుగులు నెమ్మదించాయి. ఫెర్గూసన్ అద్భుత యార్కర్‌కు డు ప్లెసిస్ క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత కూడా ఆమ్లా, మార్క్‌రమ్ (38; 4 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడమే గగనంగా మారింది.
75 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ భాగస్వామ్యం 52 పరుగులకు చేరిన తర్వాత ఆమ్లా కూడా బౌల్డ్‌గానే వెనుదిరిగాడు. మార్క్‌రమ్ కొద్ది సేపటికే పెవిలియన్ చేరాడు. ఈ స్థితిలో డసెన్, మిల్లర్ (36; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. ఒక దశలో వరుసగా ఎనిమిది ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాకపోయినా, ఆ తర్వాత మంచి షాట్లతో వీరిద్దరు లెక్క సరిచేశారు. ఫెర్గూసన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మిల్లర్, అదే ఓవర్లో ఔటయ్యాడు. డసెన్, మిల్లర్ ఐదో వికెట్‌కు 72 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో డసెన్ వరుసగా 6, 4 కొట్టడంతో స్కోరు 240 పరుగులు దాటింది.
గ్రాండ్‌హోమ్ జోరు...
ఛేదనలో న్యూజిలాండ్ బాగా ఇబ్బంది పడింది. రబడ రెండో ఓవర్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి మున్రో (9) వెనుదిరగడంతో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్‌కు విలియమ్సన్, గప్టిల్ (59 బంతుల్లో 35; 5 ఫోర్లు) కలిసి 60 పరుగులు జోడించడంతో ఇన్నింగ్స్ కుదుటపడింది. భారీ షాట్ ఆడబోయి పట్టుతప్పిన గప్టిల్ తన కాలితోనే వికెట్లను తన్ని పెవిలియన్ చేరాడు! 8 పరుగుల వ్యవధిలో టేలర్ (1), లాథమ్ (1) ఔట్ కావడంతో కివీస్ కష్టాల్లో పడింది. విలియమ్సన్‌కు నీషమ్ (23) అండగా నిలిచాడు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. అయితే విలియమ్సన్‌కు తోడు గ్రాండ్‌హోమ్ దూకుడైన బ్యాటింగ్ కివీస్‌ను గెలిపించాయి. దక్షిణాఫ్రికా పేలవ ఫీల్డింగ్ కూడా కలిసొచ్చింది. 3 క్యాచ్‌లు వదిలేసిన మిల్లర్... విలియమ్సన్‌ను రనౌట్ చేసే బంగారు అవకాశాన్ని చేజార్చాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (బి) బౌల్ట్ 5; ఆమ్లా (బి) సాన్‌ట్నర్ 55; డు ప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 23; మార్క్‌రమ్ (సి) మున్రో (బి) గ్రాండ్‌హోమ్ 38; వాన్ డర్ డసెన్ (నాటౌట్) 67; మిల్లర్ (సి) బౌల్ట్ (బి) ఫెర్గూసన్ 36; ఫెలుక్‌వాయో (సి) విలియమ్సన్ (బి) ఫెర్గూసన్ 0; మోరిస్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 241.
వికెట్ల పతనం: 1–9, 2–59, 3–111, 4–136, 5–208, 6–218.
బౌలింగ్: హెన్రీ 10–2–34–0, బౌల్ట్ 10–0–63–1, ఫెర్గూసన్ 10–0–59–3, గ్రాండ్‌హోమ్ 10–0–33–1, సాన్‌ట్నర్ 9–0–45–1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (హిట్‌వికెట్) (బి) ఫెలుక్‌వాయో 35; మున్రో (సి అండ్ బి) రబడ 9; విలియమ్సన్ (నాటౌట్) 106; టేలర్ (సి) డి కాక్ (బి) మోరిస్ 1; లాథమ్ (సి) డి కాక్ (బి) మోరిస్ 1; నీషమ్ (సి) ఆమ్లా (బి) మోరిస్ 23; గ్రాండ్‌హోమ్ (సి) డు ప్లెసిస్ (బి) ఇన్‌గిడి 60; సాన్‌ట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.3 ఓవర్లలో 6 వికెట్లకు) 245.
వికెట్ల పతనం: 1–12, 2–72, 3–74, 4–80, 5–137, 6–228.
బౌలింగ్: రబడ 10–0–42–1, ఇన్‌గిడి 10–1–47–1, మోరిస్ 10–0–49–3, ఫెలుక్‌వాయో 8.3–0–73–1, తాహిర్ 10–0–33–0.
విలియమ్సన్
Comments
Please login to add a commentAdd a comment