ముంబయి : టీమిండియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో పర్యాటక జట్టు న్యూజిలాండ్ శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే ఛేదించింది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లాథమ్ (102 బంతుల్లో 103 నాటౌట్: 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 95: 8 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ లతో నాలుగో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మరోవైపు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో వారికి విజయం నల్లేరుపై నడక అయింది. చివర్లో ఒక్క పరుగు అవసరమైన సమయంలో టేలర్ ఔట్ కావడంతో క్రీజులోకొచ్చిన నికోల్స్ ఫోర్ కొట్టడంతో కివీస్ సంబరాలు మొదలయ్యాయి. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, కుల్దీప్, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న కోహ్లీ సేన కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను మాత్రం ఓటమితో ఆరంభించింది.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. 200వ వన్డే ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం (125 బంతుల్లో 121: 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో రాణించాడు. దినేష్ కార్తిక్ (37), ధోని(25)తో భాగస్వామ్యాలు నమోదు చేస్తూ జట్టుకు పరుగులు జోడించాడు కోహ్లీ. అయితే చివరి ఓవర్లలో భారత్ 8 రన్ రేట్ తో పరుగులు సాధిస్తూ వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 10 ఓవర్లు వేసి 35 పరుగులే ఇచ్చి ఓపెనర్లు సహా నాలుగు వికెట్లు తీశాడు. సౌథీ 3 వికెట్లు తీయగా, శాంట్నర్‌కు ఓ వికెట్ దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే 25న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment