టీమిండియా బౌలర్లకు పరీక్ష!
ఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే మార్టిన్ గప్టిల్(0) వికెట్ ను కోల్పోయిన న్యూజిలాండ్.. ఆ తరువాత రెండో వికెట్ కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. టామ్ లాధమ్(46) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయి రెండో వికెట్ గా అవుటయ్యాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్ రెండో బంతికి గప్టిల్ ను బౌల్డ్ చేశాడు. అనంతరం లాధమ్ కు జత కలిసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో లాధమ్ ను స్పిన్నర్ కేదర్ జాదవ్ ఎల్బీగా అవుట్ చేశాడు. దాంతో వీరి వందపరుగులకు పైగా భాగస్వామ్యానికి తెరపడింది. కివీస్ 25.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. తొలి వన్డేలో చెలరేగిన భారత బౌలర్లు.. రెండో వన్డేలో వికెట్ల వేటలో వెనకబడ్డారు. భారత బౌలర్లు ఎన్ని వైవిధ్యమైన బంతులను విసురుతున్నా న్యూజిలాండ్ మాత్రం వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతుంది.