
77 పరుగులకే ఏడు వికెట్లు..
దక్షిణాఫ్రికాతో ఇక్కడ శనివారం జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ విలవిల్లాడుతోంది.
వెల్లింగ్టన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ శనివారం జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ విలవిల్లాడుతోంది. దక్షిణాఫ్రికా విసిరిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 77 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. న్యూజిలాండ్ ఓపెనర్లు బ్రౌన్ లీ(2),లాథమ్(0)లు ఆదిలోనే పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత టాపార్డర్ ఆటగాళ్లు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23), రాస్ టేలర్(18), బ్రూమ్(0), సాంత్నార్(1), నీషమ్(13)లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్(68), కెప్టెన్ ఏబీ డివిలియర్స్(85)లు రాణించగా, డు ప్లెసిస్(36), పార్నెల్(35) ఫర్వాలేదనిపించారు. ఐదు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న సంగతి తెలిసిందే.