కివీస్ ఎదురీత: వర్షం ఆటంకం
కోల్ కతా:భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కల్గించాడు. రెండో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ కీలక వికెట్లను కోల్పోయి ఎదురీదుతున్న సమయంలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. మ్యాచ్ నిలిచి పోయే సమయానికి న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఆటగాళ్లలో గప్టిల్(13), లాథమ్(1), నికోలస్(1), ల్యూక్ రోంచీ(35)లు పెవిలియన్ చేరారు. ఈ నాలుగు వికెట్లలో రెండు వికెట్లు భువనేశ్వర్ కుమార్ సాధించగా, షమీ, జడేజాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 316 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆటలో వృద్ధిమాన్ సాహా(54 నాటౌట్;7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.