మరోసారి డీఆర్ఎస్ రగడ!
అడిలైడ్: క్రికెట్ లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)పై మరోసారి రగడ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య అడిలైడ్ లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ విధానం సరిగా లేదంటూ న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సెన్ బహిరంగంగా రచ్చకెక్కాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ కీలకంగా మారినప్పుడు ఫీల్డ్ అంపైర్లు పదే పదే డీఆర్ఎస్ కు వెళ్లడం.. ఆ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా రావడంపై హెస్సెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు డీఆర్ఎస్ విధానం అమలుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పష్టత ఇవ్వాలని హెస్సెన్ కోరాడు.
శనివారం మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు లాథన్ లయన్ అవుటైనా.. టీవీ అంపైర్ నిగెల్ లాంగ్ నాటౌల్ గా ప్రకటించడంతో లాథన్ తిరిగి బ్యాటింగ్ చేయించడాన్ని హెస్సెన్ తప్పుపట్టాడు. హాట్ స్పాట్ లో నాథన్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించినట్లు హెస్సెన్ తెలిపాడు. అడిలైడ్ మ్యాచ్ లో తక్కువ స్కోర్లు నమోదు కావడం.. ఆపై తమకు డీఆర్ఎస్ ఇబ్బందికరంగా మారడంతోనే ఓటమి పాలైనట్లు తెలిపాడు. తాను అవుటైనట్లు భావించి నాథల్ పెవిలియన్ కు చేరే క్రమంలో ఆ నిర్ణయం డీఆర్ఎస్ కు వెళ్లడం.. మళ్లీ నాథన్ తిరిగి క్రీజ్ లో రావడంతో పరిస్థితి మొదటికొచ్చిందన్నాడు. దీంతో నాథన్-పీటర్ నావిల్ జోడి తొమ్మిది వికెట్ కు 74 పరుగులు భాగస్వామ్యాన్నినమోదు చేయడంతో ఫలితం తమకు వ్యతిరేకంగా వచ్చిందన్నాడు.
ఆ మ్యాచ్ లో డీఆర్ఎస్ విధానంపై న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్ మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు హెస్సెన్ తెలిపాడు. దీనిపై మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామాను సంప్రదించినట్లు పేర్కొన్నాడు. కాగా, తమ జట్టు యాజమాన్యం డిమాండ్ పై ఎటువంటి స్పష్టత రాలేదన్నాడు. డీఆర్ఎస్ విధానం అమలుపై ఐసీసీ ఇచ్చే స్పష్టత కోసం తాము నిరీక్షిస్తున్నట్లు హెస్సెన్ తెలిపాడు. ఆ మ్యాచ్ లో కివీస్ విసిరిన 187 పరుగుల విజయలక్ష్యాన్ని చేరేక్రమంలో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.