చివర్లో న్యూజిలాండ్ డీలా..
న్యూఢిల్లీ: భారత్ తో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 243 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆదిలోనే మార్టిన్ గప్టిల్(0) వికెట్ ను కోల్పోయింది. అనంతరం టామ్ లాధమ్-కేన్ విలియమ్సన్ జోడి మరమ్మత్తులు చేపట్టి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం లాధమ్(46; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆపై కెప్టెన్ విలియమ్సన్ మరింత బాధ్యతగా ఆడాడు. రాస్ టేలర్(21), కోరీ అండర్సన్(21)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించినా, విలియమ్సన్ (118;128 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) తో శతకం సాధించాడు.
కాగా, ఆ తరువాత 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కివీస్ కోల్పోవడంతో ఆ జట్టు పరుగుల వేగం తగ్గింది. ప్రధానంగా తన ఇన్నింగ్స్ లో 40.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగుతో పటిష్ట స్థితిలో నిలిచిన న్యూజిలాండ్.. మిగతా 10.0 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 40 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ మిగతా ఆటగాళ్లలో ల్యూక్ రోంచీ(6), డెవిచిచ్(7), సౌతీ(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో న్యూజిలాండ్ 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా, బూమ్రాలకు చెరో మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్,అక్షర్ పటేల్, కేదర్ జాదవ్లకు తలో వికెట్ లభించాయి.