ఆసీస్‌తో కివీస్‌ అమీతుమీ | New Zealand vs Australia World Cup Head to Head Match | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో కివీస్‌ అమీతుమీ

Published Sat, Jun 29 2019 9:02 AM | Last Updated on Sat, Jun 29 2019 9:02 AM

New Zealand vs Australia World Cup Head to Head Match - Sakshi

లండన్‌: ప్రపంచ కప్‌లో ఇప్పటికే సెమీస్‌ చేరిన ఆస్ట్రేలియా... అందుకు మరొక్క విజయం దూరంలో ఉన్న న్యూజిలాండ్‌ శనివారం ఇక్కడ తలపడనున్నాయి. మ్యాచ్‌ మ్యాచ్‌కు దుర్బేధ్యంగా మారుతూ అన్ని రంగాల్లో చెలరేగి ఆడుతున్న ఆసీస్‌ను అడ్డుకోవడం కివీస్‌కు సవాలే. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ ఫించ్, వార్నర్, బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ కంగారూలను ముందుండి నడిపిస్తున్నారు. ఎడం చేతి వాటం పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విరుచుకుపడిన తీరు చూస్తే ఆ జట్టు బౌలింగ్‌ ఎంత భీకరంగా ఉందో తెలుస్తోంది. మోస్తరుగా ఆడుతున్న స్టీవ్‌ స్మిత్, ఉస్మాన్‌ ఖాజా కూడా బ్యాట్‌ ఝళిపిస్తే ఆసీస్‌ను ఆపడం ఎవరి తరం కాదు.

న్యూజిలాండ్‌కు ఓపెనర్ల పేలవ ఫామ్‌ పెద్ద సమస్యగా మారింది. విధ్వంసకరంగా ఆడగల గప్టిల్, మున్రో కనీసం పది ఓవర్లైనా నిలవడం లేదు. వీరిద్దరూ టోర్నీలో ఇప్పటివరకు ఒక్కో అర్ధ శతకం మాత్రమే చేశారు. అద్భుత ఫామ్‌తో గట్టెక్కిస్తున్న కెప్టెన్‌ విలియమ్సన్‌... పాక్‌తో మ్యాచ్‌లో సాధారణ స్కోరుకు పరిమితం కావడం ఓటమికి కారణమైంది. రాస్‌ టేలర్, లాథమ్‌ మరిన్ని పరుగులు సాధించాల్సి ఉంది. బౌల్ట్, హెన్రీ, ఫెర్గూసన్‌ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉండటంతో బౌలింగ్‌లో కివీస్‌కు బెంగలేదు. ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్, స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌ జట్టును కష్టాల నుంచి బయట పడేస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణిస్తేనే జట్టు ఆసీస్‌కు పోటీ ఇవ్వగలదు. 

ముఖాముఖి రికార్డు : రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 136 మ్యాచ్‌లు జరగ్గా 90 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 39 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ నెగ్గాయి. ఏడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో 10 మ్యాచ్‌ల్లో తలపడగా ఏడింట్లో ఆసీస్, మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ గెలుపొందింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement