నాటింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం దెబ్బకు మరో మ్యాచ్ కొట్టుకుపోయింది. టాస్ వేసే అవకాశమే లేనంతగా వర్షం పడటంతో గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. మధ్యలో పలుమార్లు వర్షం తెరిపిచ్చినా మళ్లీ ప్రారంభం కావడంతో నీళ్లు తోడటానికి గ్రౌండ్‌మెన్ తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం చేత టాస్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే వర్షం కాస్త తెరుపు ఇవ్వడంతో టాస్‌ను గం. 3.00ని.లకు వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆ క్రమంలోనే పిచ్‌పై కవర్లు తొలగించారు. కాగా, మళ్లీ వర్షం కురవడం ప్రారంభం కావడంతో పిచ్‌ను మళ్లీ కవర్లతో కప్పి వేశారు. ఇలా వర్షం వస్తూ పోతూ ఉండటంతో మ్యాచ్ కనీసం 20 ఓవర్ల పాటు జరుగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చివరగా రాత్రి గం. 7.30ని.లకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పిచ్, ఔట్‌ఫీల్డ్ మ్యాచ్ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో ఫీల్డు అంపైర్లు ఎరాస్మస్, పాల్ రీఫెల్‌లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఇరు జట్లకు తలో పాయింట్ వచ్చింది. ప్రస్తుతం కివీస్ 7 పాయింట్లతో ఉండగా, భారత్ 5 పాయింట్లతో ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం నాల్గోసారి. ఇలా ప్రపంచకప్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment