బౌల్ట్‌ దెబ్బకు బోల్తా | New Zealand win with 8 wickets | Sakshi
Sakshi News home page

బౌల్ట్‌ దెబ్బకు బోల్తా

Published Fri, Feb 1 2019 1:09 AM | Last Updated on Fri, Feb 1 2019 5:01 AM

New Zealand win with 8 wickets - Sakshi

ఔరా బౌల్ట్‌!  ఏమా బౌలింగ్‌? అటు స్వింగ్, ఇటు పేస్, మధ్యమధ్యలో బౌన్స్‌తో గాల్లో ఏ దిక్కుకు వెళ్తుందో అంతుపట్టని బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఆటాడుకున్నాడీ కివీస్‌ పేసర్‌. ఒక్కో బంతి ఒక్కో గండం తీరుగా... ఒక్క పరుగు వచ్చినా పండుగే అన్నట్లు బ్యాట్స్‌మెన్‌ భావించేట్లుగా... తమ దేశంలోని  పిచ్‌ల అసలు స్వభావాన్ని టీమిండియాకు మరోసారి గుర్తుచేశాడీ ఎడంచేతి వాటం బౌలర్‌.

ఊపిరి సలపనివ్వకుండా... పుంజుకొనే అవకాశమే లేకుండా... ఏకబిగిన పది ఓవర్లు వేసేసి ప్రత్యర్థిని చుట్టేశాడు. అతడి ధాటికి వణికిపోయిన రోహిత్‌ బృందం విదేశాల్లో కుప్పకూలే పేకమేడ లాంటి ఒకనాటి బ్యాటింగ్‌ ఆర్డర్‌ను తలపించింది. బౌల్ట్‌కు తోడు గ్రాండ్‌హోమ్‌ ధాటికి టీమిండియా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా కలిపి 30 పరుగులే చేయగలిగారు. దీంతో నాలుగో వన్డేలో కివీస్‌ జయభేరి మోగించింది.   

హామిల్టన్‌: న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా హ్యాట్రిక్‌ విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. బంతిని వికెట్‌కు రెండు వైపులా అద్భుతంగా స్వింగ్‌ చేస్తూ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (5/21) చెలరేగడంతో గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో కివీస్‌ 8 వికెట్లతో సునాయాసంగా గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌... ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్‌ దెబ్బకు 30.5 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటైంది. పదో స్థానంలో దిగిన యజువేంద్ర చహల్‌ (37 బంతుల్లో 18 నాటౌట్‌; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌.

ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (20 బంతుల్లో 16; 4 ఫోర్లు), స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (33 బంతుల్లో 15; 1 ఫోర్‌) కొన్ని పరుగులు చేశారు. గ్రాండ్‌హోమ్‌ (3/26) మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్‌ నికోల్స్‌ (42 బంతుల్లో 30 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌)కు తోడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ (25 బంతుల్లో 37 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) నిలబడటంతో ఆతిథ్య జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 93 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఈ నెల 3న వెల్లింగ్టన్‌లో జరుగనుంది. 

నిలవలేకపోయారు 
ఐదు ఓవర్లలో 20 పరుగులతో టీమిండియా ఇన్నింగ్స్‌ ఆశావహంగానే ప్రారంభమైంది. హెన్రీ బౌలింగ్‌లో ధావన్‌ ఫోర్, సిక్స్‌ కొట్టడంతో గత మ్యాచ్‌ల్లానే మన జట్టుదే ఆధిపత్యం అనుకున్నారంతా. కానీ, ఆరో ఓవర్‌ నుంచి మొదలైంది బౌల్ట్‌ హవా. అతడి ధాటికి ధావన్‌ (13) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం ఫుల్‌ లెంగ్త్‌ బంతిని పుష్‌ చేయబోయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (7) బౌల్ట్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. మరో ఎండ్‌లో బౌలింగ్‌కు దిగిన గ్రాండ్‌హోమ్‌... అంబటి రాయుడు (0), దినేశ్‌ కార్తీక్‌ (0)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేశాడు.

వికెట్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి వీరిద్దరూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. బౌల్ట్‌ బౌన్సర్‌ హెల్మెట్‌కు తగిలి బెంబేలెత్తించినా రెండు మంచి షాట్లు కొట్టి సౌకర్యంగానే కనిపించిన యువ శుబ్‌మన్‌ గిల్‌ (9) అచ్చం రోహిత్‌ తీరుగానే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. కేదార్‌ జాదవ్‌ (1)నూ పెవిలియన్‌ చేర్చి 35/6తో టీమిండియాను బౌల్ట్‌ దిక్కు తోచని స్థితిలో పడేశాడు. కాసేపు నిలిచిన భువనేశ్వర్‌ (1)ను గ్రాండ్‌హోమ్‌ బౌల్డ్‌ చేశాడు.

లాభం లేదని భావించిన పాండ్యా... బౌల్ట్‌పై ఎదురుదాడికి దిగి మూడు బౌండరీలు బాదాడు. అతడిని షార్ట్‌ లెంగ్త్‌ బంతితో బలిగొన్న కివీస్‌ ఎడంచేతి వాటం పేసర్‌ ఐదు వికెట్ల ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 55/8. కుల్దీప్, చహల్‌ 9వ వికెట్‌కు 57 బంతుల్లో 25 పరుగులు జోడించి పరువు కాపాడారు. జట్టు స్కోరులో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. కుల్దీప్‌ను ఆస్టల్, ఖలీల్‌ను నీషమ్‌ ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. 

అలవోకగానే...  
స్వల్ప లక్ష్యాన్ని ఊదేద్దామని భావించాడో ఏమో, భువనేశ్వర్‌ వేసిన తొలి బంతికి సిక్స్, ఆ వెంటనే రెండు ఫోర్లు బాది కివీస్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు మార్టిన్‌ గప్టిల్‌ (14). కానీ, లెగ్‌ వికెట్‌పై పడిన నాలుగో బంతి అతడి బ్యాట్‌ అంచుకు తాకి గాల్లోకి లేవగా పాయింట్‌లో పాండ్యా క్యాచ్‌ అందుకున్నాడు. నికోల్స్, కెప్టెన్‌ విలియమ్సన్‌లు ఖలీల్‌ బౌలింగ్‌లో పరుగులు రాబట్టారు. విలియమ్సన్‌ను భువీ త్వరగానే ఔట్‌ చేసినా నికోల్స్, టేలర్‌ మరో అవకాశం ఇవ్వలేదు. చహల్‌ను లక్ష్యంగా చేసుకున్న టేలర్‌ భారీ షాట్లు కొట్టాడు. అతడు వేసిన 13వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అతడి మరుసటి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

తేడా అతడే...! 
మ్యాచ్‌లో భారత్, కివీస్‌ మధ్య తేడా బౌల్టే. ఏమంత ప్రమాదకరంగా లేని, కుదురుకుంటే పరుగులు వచ్చే పిచ్‌ అయినప్పటికీ బౌల్ట్‌ స్వింగింగ్‌ డెలివరీలతో మన బ్యాట్స్‌మెన్‌ పని పట్టాడు. ధావన్, రోహిత్, శుబ్‌మన్, జాదవ్‌లను అతడు ఔట్‌ చేసిన తీరు ఆకట్టుకుంది. వరుసగా ఓవర్లు వేస్తూ బౌల్ట్‌ బెంబేలెత్తిస్తుంటే... కోహ్లి, ధోని లేని టీమిండియాకు పోరాడే అవకాశమే లేకుండా పోయింది. అతడి బౌలింగ్‌ కోటా ముగిసిన తర్వాత పరిస్థితి తుపాను అనంతరం ప్రశాంతతలా కనిపించింది. దీంతోనే కుల్దీప్, చహల్‌ విలువైన పరుగులు జోడించడం గమనార్హం. 

శుబ్‌మన్‌ అరంగేట్రం... 
భారత్‌ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో 19 ఏళ్ల బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అరంగేట్రం చేశాడు. ధోని చేతుల మీదుగా గిల్‌ క్యాప్‌ అందుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో బరిలోకి దిగిన 227వ క్రికెటర్‌గా గిల్‌ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తీరిక లేకుండా ఆడుతున్న పేసర్‌ షమీ బదులుగా ఖలీల్‌ను తీసుకుంది. గాయం నుంచి ధోని కోలుకోకపోవడంతో దినేశ్‌ కార్తీక్‌ కీపింగ్‌ చేశాడు.  

►2 భారత ఇన్నింగ్స్‌లో పదో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువడం ఇది రెండోసారి మాత్రమే. 1998లో పాకిస్తాన్‌తో టొరంటోలో జరిగిన మ్యాచ్‌లో శ్రీనాథ్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

►1 మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌కిదే ఘోర పరాజయం. ఈ మ్యాచ్‌లో 212 బంతులు మిగిలి ఉండగానే భారత్‌కు ఓటమి ఎదురైంది. 2010 దంబుల్లాలో శ్రీలంక చేతిలో భారత్‌ 209 బంతులు మిగిలి ఉండగా ఓడింది.  

►1 న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 2002 ఆక్లాండ్‌లో జరిగిన వన్డేలో భారత్‌ 108 పరుగులకు ఆలౌటైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement