కరాచీ: మరో 12 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12 సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఆరంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ పొట్టి క్రికెట్ సంగ్రామం కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌పై పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ పాకిస్తాన్‌లో జరుగుతుందంటూ నోరుజారాడు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్‌ఎల్)కు బదులుగా 'ఐపీఎల్' అని వ్యాఖ్యానించి నాలుక కరచుకున్నాడు.
పీఎస్‌ఎల్ మొత్తం పాకిస్తాన్‌లో జరగదు. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈలో నిర్వహిస్తున్నారు. అయితే, నాకౌట్ మ్యాచ్‌లు లేదా పైనల్ మ్యాచ్‌ని మాత్రమే పాకిస్తాన్‌లో నిర్వహిస్తున్నారు. తాజా సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లకు దుబాయి ఆతిథ్యమిస్తుండగా. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు కరాచీలో జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమర్ అక్మల్ ఓ వీడియోని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అందులో ‘సొంతగడ్డపై అభిమానుల మద్దతు ఉంటే.. వచ్చే ఐపీఎల్ పాకిస్తాన్‌లోనే జరుగుతుంది’ అని ఉమర్ అక్మల్ అన్నాడు. ఆపై వెంటనే తేరుకున్న ఉమర్ అక్మల్ సారీ.. పీఎస్‌ఎల్ పాకిస్తాన్‌లోనే జరుగుతుందని సరిదిద్దుకునే యత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment