నెయమార్ అరుదైన ఫీట్
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ నెయమార్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్లో అత్యంత వేగంగా గోల్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బుధవారం రాత్రి హెండూరాస్ తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో బ్రెజిల్ కెప్టెన్ నెయమార్ అత్యంత వేగవంతమైన గోల్ సాధించి ఒలింపిక్స్ చరిత్రను తిరగరాశాడు. ఆట ప్రారంభమైన 15 సెకండ్లలోనే గోల్ సాధించి ఈ ఘనతను అందుకున్నాడు. ఇది నెయమార్ కెరీర్లో రెండో అత్యంత వేగవంతమైన గోల్ కాగా, ఒలింపిక్స్ లో అతనికి ఇదే మొదటి ఫాస్టెస్ట్ గోల్.
గత ఒలింపిక్స్ లో మెక్సికో ఫార్వర్డ్ ఆటగాడు పెరాల్టా 29 సెకెండ్లలో గోల్ నమోదు చేయగా, రియో ఒలింపిక్స్లో హెండూరాస్ స్ట్రైకర్ అలబెర్త్ ఎలిస్ ఈ మార్కును చేరాడు. కాగా, ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ముందే ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో కెనడా క్రీడాకారిణి జనైన్ బెకీ కేవలం 20 సెకెండ్లలోపే గోల్ సాధించి ఫాస్టెస్ట్ గోల్ సాధించింది. తాజాగా నెయమార్ అంతకంటే ముందుగానే గోల్ సాధించడంతో బెకీ రికార్డు తెరమరుగైంది. ఈ మ్యాచ్లో బ్రెజిల్ 6-0 తేడాతో విజయం సాధించి జర్మనీతో తుదిపోరుకు సిద్దమైంది.
ఆగస్టు 20 వ తేదీన జరిగిన పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటివరకూ ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో స్వర్ణాన్ని సాధించని బ్రెజిల్.. జర్మనీపై గెలిచి తమ చిరకాల కోరికను తీర్చుకోవాలని భావిస్తోంది. గత లండన్ ఒలింపిక్స్లో ఫైనల్ కు చేరిన బ్రెజిల్ రజతంతోనే సరిపెట్టుకుంది. దాంతోపాటు స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్ లో విజేత గా నిలిచి 2014 వరల్డ్ కప్ లో జర్మనీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెజిల్ యోచిస్తోంది.