రోస్‌బర్గ్ ‘సిక్సర్’...
సీజన్‌లో ఆరో విజయం
తొలిసారి బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
టాప్-5లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు
స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన రోస్‌బర్గ్ గంటా 44 నిమిషాల 51.058 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సాధించాడు. 21వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని పొందగా... రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు.
పదో ల్యాప్‌లో మాగ్నుసెన్ (రెనౌ) కారు ప్రమాదానికి గురి కావడంతో పది నిమిషాలపాటు రేసును నిలిపివేశారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ నాలుగో స్థానంలో, సెర్గియో పెరెజ్ ఐదో స్థానంలో నిలిచి మొత్తం 22 పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితంతో కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో ఫోర్స్ ఇండియా జట్టు 103 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 4న జరుగుతుంది.