Belgium Grand Prix title
-
లెక్‌లెర్క్‌దే టైటిల్
మోంజా (ఇటలీ): ఫార్ములావన్ ట్రాక్‌పై దూసుకొచ్చిన కొత్త సంచలనం చార్లెస్ లెక్లెర్క్. ఈ ఫెరారీ డ్రైవర్ గతవారం బెల్జియం గ్రాండ్ ప్రి గెలిచాడు. ఈ వారమిక్కడ పోల్ పొజిషన్ సాధించాడు. తాజాగా మరో ఫార్ములావన్‌ను కైవసం చేసుకున్నాడు. ఫెరారీ సొంతగడ్డ అయిన ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవరే అందనంత వేగంతో దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో అతను విజేతగా నిలిచాడు. ఇటాలియన్ సర్క్యూట్‌పై మెరుపువేగాన్ని కనబరిచాడు. 53 ల్యాపుల రేసును ఒక గంటా 15 నిమిషాల 26.665 సెకన్లలో పూర్తి చేశాడు. ఆరంభం నుంచి గట్టి పోటీనిచ్చిన మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్‌లను మట్టికరిపించాడు. అతని వేగానికి 0.835 సెకన్ల తేడాతో బొటాస్ రెండు, 35.199 సెకన్లతో హామిల్టన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. లెక్లెర్క్ విజయంతో ఫెరారీ జట్టుకు సొంతగడ్డపై తొమ్మిదేళ్ల తర్వాత టైటిల్ దక్కింది. అయితే ఫెరారీ మరో డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్‌కు ఇక్కడ నిరాశే ఎదురైంది. పుంజుకోలేని వేగం, తడబాటుతో అతను 52 ల్యాపుల్ని పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈ నెల 22న జరుగనుంది. -
హామిల్టన్‌దే విక్టరీ
బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ కైవసం స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ సీజన్లో లూయిస్ హామిల్టన్ మరో టైటిల్ సాధించాడు. ఆదివారం బెల్జియం గ్రాండ్‌ప్రిలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది హామిల్టన్ సాధించిన ఐదో టైటిల్ ఇది. ఓవరాల్‌గా 32 ఏళ్ల ఈ బ్రిటన్ రేసర్ తన 200వ గ్రాండ్‌ప్రి రేసును విజయంతో ముగించాడు. తన కెరీర్లో అతనికిది 58వ విజయం కావడం మరో విశేషం. శనివారం 68వ పోల్ పొజిషన్‌తో జర్మనీ రేసింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును సమం చేసిన హామిల్టన్ అదే జోరును ప్రధాన రేసులోనూ కనబరిచాడు. 44 ల్యాప్‌ల ఈ ట్రాక్‌లో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గట్టి పోటీనిచ్చాడు. కొన్ని ల్యాపుల్లో హామిల్టన్‌కు అత్యంత చేరువైనా... అతని విజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. చివరకు రేసును మెర్సిడెస్ డ్రైవర్ అందరి కంటే ముందుగా గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 2.358 సెకన్ల వ్యవధిలో వెటెల్ రన్నరప్‌గా నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో మూడో స్థానంతో పోడియంలో నిలిచాడు. జోరుమీదున్న హామిల్టన్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 3) ఇటాలియన్ గ్రాండ్‌ప్రి గెలిస్తే ఈ ఏడాది చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఆధిక్యంలోకి వస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్బన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ రేసును పూర్తిచేయలేకపోయాడు. 42 ల్యాపుల్ని పూర్తి చేసిన అతను 17వ స్థానం దక్కించుకున్నాడు. -
రోస్‌బర్గ్ ‘సిక్సర్’...
సీజన్లో ఆరో విజయం తొలిసారి బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం టాప్-5లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు స్పా-ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన రోస్‌బర్గ్ గంటా 44 నిమిషాల 51.058 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సాధించాడు. 21వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని పొందగా... రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. పదో ల్యాప్‌లో మాగ్నుసెన్ (రెనౌ) కారు ప్రమాదానికి గురి కావడంతో పది నిమిషాలపాటు రేసును నిలిపివేశారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ నాలుగో స్థానంలో, సెర్గియో పెరెజ్ ఐదో స్థానంలో నిలిచి మొత్తం 22 పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితంతో కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో ఫోర్స్ ఇండియా జట్టు 103 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 4న జరుగుతుంది.