రెండు దశాబ్దాల తర్వాత... | Nigeria loses to Croatia 2-0 | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల తర్వాత...

Published Mon, Jun 18 2018 6:40 AM | Last Updated on Mon, Jun 18 2018 12:38 PM

 Nigeria loses to Croatia 2-0 - Sakshi

కలినిన్‌గ్రాడ్‌: రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లోనే క్రొయేషియా జట్టు విజయం రుచిని చూసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో క్రొయేషియా 2–0తో నైజీరియాను ఓడించింది. నైజీరియా ఆటగాడు ఒగెనెకరో ఎటెబో చేసిన సెల్ఫ్‌ గోల్‌తో క్రొయేషియా ఖాతా తెరువగా... 71వ నిమిషంలో కెప్టెన్‌ మోడ్రిక్‌ గోల్‌తో క్రొయేషియా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కుతున్న సమయంలో అనూహ్యంగా ఎటెబో తమ గోల్‌పోస్ట్‌లోకే గోల్‌ కొట్టాడు.

ఆట 32వ నిమిషంలో అంటె రెబిక్, మరియో మండ్‌జుకిక్‌నుంచి బంతిని అందుకునే క్రమంలో ఫస్ట్‌–హాఫ్‌ కార్నర్‌ వద్ద ఎటెబో నుంచి బంతి గోల్‌పోస్ట్‌లోకి చేరడంతో నైజీరియాకు సొంతదెబ్బ తగిలింది. దీంతో క్రొయేషియా అయాచిత వరంతో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది. నైజీరియా స్ట్రయికర్లను అదేపనిగా ప్రత్యర్థి డిఫెండర్లు నిలువరించారు. దీంతో డెజన్‌ లొవ్రెన్, ఒడియన్‌ ఇగాలో గోల్‌ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. క్రొయేషియా డిఫెండర్లు అలెక్స్‌ ఐవోబి, బ్రియాన్‌ ఇడోవులు ప్రత్యర్థి అవకాశాల్ని సమర్థంగా దెబ్బతీశారు.

ఫలితంగా 59వ నిమిషంలోగానీ నైజీరియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్‌ కొట్టకపోవడం గమనార్హం. నైజీరియా డిఫెండర్‌ విలియమ్‌ ట్రూస్ట్‌ ఎకాంగ్‌... కార్నర్‌ వద్ద క్రొయేషియా ఫార్వర్డ్‌ ఆటగాడు మరియో మండ్‌జుకిక్‌ను దురుసుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. ఆట 71వ నిమిషంలో మోడ్రిక్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్‌గా మలచడంతో క్రొయేషియా 2–0తో జయభేరి మోగించింది.


2 వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ క్రొయేషియా జట్టు ‘సెల్ఫ్‌ గోల్‌’తో ఖాతా తెరువడం విశేషం. 2014లో క్రొయేషియాపై బ్రెజిల్‌ ప్లేయర్‌ మార్సెలో సెల్ఫ్‌ గోల్‌ చేయగా... ఈసారి ఎటెబో సాధించాడు.  

1 ప్రపంచకప్‌ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ‘సెల్ఫ్‌ గోల్‌’ చేసిన ఏకైక జట్టుగా నైజీరియా నిలిచింది. చివరిసారి 2014 ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టుపై ఇదే విధంగా నైజీరియా సెల్ఫ్‌ గోల్‌ సాధించింది.

1 ఇరవై ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం క్రొయేషియాకిదే తొలిసారి. చివరిసారి 1998లో అరంగేట్రం మ్యాచ్‌లో క్రొయేషియా 3–1తో జమైకాను ఓడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement