
ఆ కప్పు వయసు తొమ్మిదేళ్లు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిదేళ్ల కెప్టెన్సీలో దిగ్గజ ఆటగాళ్లతో పాటు తన సమకాలికులతోనూ, జూనియర్లతోనూ జట్లను నడిపించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోని. దాంతో పాటు భారత్ తరపున ఘనమైన రికార్డు కూడా ధోని సొంతం. అయితే ధోని కెప్టెన్ గా ఎంపికైన తొలి ఏడాదే టీ 20 వరల్డ్ కప్ను గెలుచుకుంది భారత క్రికెట్ జట్టు. ఆ కప్ను గెలిచి సరిగ్గా ఈరోజుకి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్ స్టేడియంలో సెప్టెంబర్ 24 వ తేదీన పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించి తొలి టీ 20 కప్ను అందుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని 20.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.భారత్ తరపున గౌతం గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఆ తరువాత 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ విజయం అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. ప్రత్యేకంగా చివరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం కావడంతో భారత అభిమానులు ఆశలు వదులుకున్నారు. అందుకు కారణంగా అప్పటికే పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడుతుండటమే. హర్భజన్ సింగ్ ఓవర్లో మూడు సిక్సర్లు, శ్రీశాంత్ బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టి పాక్ ను విజయం వైపు పరుగులు పెట్టించాడు.
అయితే చివరి ఓవర్ను అందుకున్న జోగిందర్ శర్మ తెలివిగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని వైడ్గా విసిరినా, తరువాత బంతికి పరుగు రాకుండా నివారించాడు. కాగా, ఆఖరి ఓవర్ రెండో బంతికి మిస్బావుల్ సిక్స్ కొట్టి పాక్ పై ఒత్తిడి తగ్గించాడు. దీంతో చివరి నాలుగు బంతుల్లో పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి.ఆ సమయంలో జోగిందర్ అత్యంత చాకచక్యంగా నెమ్మదిగా వేసిన బంతికి మిస్బా బోల్తా పడ్డాడు. ఆ బంతిని ప్యాడల్ స్కూప్ ద్వారా ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ కొడదామనుకున్నాడు. అయితే షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ బంతిని ఒడిసి పట్టుకోవడంతో పాక్ ఇన్నింగ్స్ కు తెరపడింది. దాంతో పాక్ నైరాశ్యంలో,భారత్ ఆనందంలో మునిగిపోవడం చకచకా జరిగిపోయాయి.