పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు | Nirdesh Baisoya Grabs All Ten Wickets In An Innings Against Nagaland | Sakshi
Sakshi News home page

పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు

Published Thu, Nov 7 2019 4:08 AM | Last Updated on Thu, Nov 7 2019 9:50 AM

Nirdesh Baisoya Grabs All Ten Wickets In An Innings Against Nagaland - Sakshi

కోల్‌కతా: మేఘాలయ ఆఫ్‌ స్పిన్నర్‌ నిర్దేశ్ బైసోయా అసాధారణ ప్రదర్శనతో రికార్డులకెక్కాడు. అండర్‌–16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లను పడగొట్టాడు. 15 ఏళ్ల నిర్దేశ్‌ బుధవారం తొలిరోజు ఆటలో నాగాలాండ్‌ను తన స్పిన్‌తో చుట్టేశాడు. 21 ఓవర్లు వేసిన ఈ కుర్రాడు 51 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఇందులో 10 ఓవర్లను మెయిడెన్లుగా వేశాడు. దీంతో నాగాలాండ్‌ జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. గత రెండేళ్లుగా నిర్దేశ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత టోరీ్నలో ఆరు మ్యాచ్‌లాడిన అతను 33 వికెట్లు తీశాడు. తాజా టోర్నీలో నాలుగే మ్యాచ్‌లాడిన అతను 27 వికెట్లు పడేశాడు.

నిజానికి నిర్దేశ్‌ సొంతూరు మీరట్‌... కానీ మేఘాలయ తరఫున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల క్రితమే భారత మేటి స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (10/74) పాకిస్తాన్‌పై ఢిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లతో చరిత్రకెక్కాడు. దీంతో ఢిల్లీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో భారత్‌ అద్వితీయ విజయాన్ని సాధించింది. గతేడాది మణిపూర్‌ పేసర్‌ రెక్స్‌ సింగ్‌ కూడా పదికి పది వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత వహించాడు. కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో అతను చరిత్ర సృష్టించగా...  పుదుచ్చేరి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సిదాక్‌ సింగ్‌ సీకే నాయుడు ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement