ఈసారి ఖేల్ రత్న లేనట్లే!
► ఏడుగురి పేర్లూ తిరస్కరణ
► ఏ అథ్లెట్‌నూ సిఫారసు చేయని సెలక్షన్ కమిటీ
► ‘అర్జున’కు 15 మంది సిఫారసు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’కు ఈ ఏడాది ఏ అథ్లెట్ పేరును ప్రతిపాదించొద్దని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. 1991లో స్థాపించిన ‘ఖేల్ రత్న’ పురస్కారం చరిత్రలో ఏ క్రీడాకారుడి పేరును సిఫారసు చేయకపోవడం ఇది మూడోసారి. ఈ అవార్డు కోసం ఎంపిక చేసిన తుది జాబితాలో వికాస్ గౌడ, కృష్ణ పూనియా (డిస్కస్ త్రోయర్లు), సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (టెన్నిస్), జీవ్ మిల్కా సింగ్ (గోల్ఫ్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో) ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వం వహిస్తున్న ఈ సెలక్షన్ కమిటీ ‘అర్జున’ అవార్డుల కోసం 15 మంది పేర్లను మాత్రం సిఫారసు చేసింది. ఇందులో క్రికెటర్ అశ్విన్, మేటి షూటర్ హీనా సిద్ధూ... అమెరికాలోని విఖ్యాత ఎన్‌బీఏ సెలక్షన్స్‌లో పాల్గొన్న కేరళ స్టార్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ గీతూ అన్నా జోస్... 2012 ప్రపంచకప్ కబడ్డీ విజేత భారత జట్టులో సభ్యురాలైన మమతా పూజారి ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన మమత దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తోంది.
ఇండియన్ రైల్వేస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోతే ఆంధ్రప్రదేశ్ తరఫున బరిలోకి దిగుతుంది. ‘పిస్టల్ షూటర్’ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. బీసీసీఐ నుంచి కేవలం క్రికెటర్ అశ్విన్ పేరును సిఫారసు చేయగా అతనికి ‘అర్జున’ ఖాయమైంది. అశ్విన్ మొత్తం 20 టెస్టుల్లో పాల్గొని 104 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టాడు.
గతేడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సింధుకు ఈసారి ‘ఖేల్త్న్ర’ దక్కుతుందని భావించారు. ‘ఖేల్త్న్ర రేసులో ఉన్న ఏడుగురి పేర్లను చర్చించాం. కపిల్ ప్రతిపాదించిన గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్‌పై ఎక్కువ సమయం చర్చ జరిగింది. అయితే జీవ్‌పై మిగతా సభ్యులు అంతగా ఆసక్తి చూపలేదు’ అని సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు తెలిపారు.
‘అర్జున’ కోసం సెలక్షన్ కమిటీ పంపించిన 15 మంది పేర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ పరిశీలిస్తుంది. వీలైతే కొంతమంది పేర్లను చేర్చడంగానీ, తొలగించడంగానీ జరుగుతుంది. ఇదే జాబితాకు ఆమోదముద్ర పడే అవకాశం కూడా ఉంటుంది. జాతీయ క్రీడాదినోత్సవం ఆగస్టు 29న ఈ అవార్డులు అందజేస్తారు.
అర్జున అవార్డుల ప్రతిపాదిత జాబితా: అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లుకా (అథ్లెటిక్స్), హెచ్.ఎన్.గిరీష (పారాలింపిక్స్), వి.దిజు (బ్యాడ్మింటన్), గీతూ అన్నా జోస్ (బాస్కెట్‌బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అశ్విన్ (క్రికెట్), అనిర్బన్ లాహిరి (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), సాజీ థామస్ (రోయింగ్), హీనా సిద్ధూ (షూటింగ్), అనక అలంకమోని (స్క్వాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్‌లిఫ్టింగ్), సునీల్ రాణా (రెజ్లింగ్).