
గీత దాటినందుకే...
న్యూఢిల్లీ: గతేడాది సెప్టెంబరులో స్పెయిన్‌తో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో... భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ అరంగేట్రంలోనే అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కానీ వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఈ ఢిల్లీ ప్లేయర్‌కు స్థానం లభించలేదు. ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేకున్నా అతనిపై వేటు వేయడానికి కారణమేంటో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే 19 ఏళ్ల సుమిత్ నాగల్‌ను జాతీయ జట్టులోకి ఎంపిక చేయలేదని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ–ఐటా) వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలో కొరియాతో జరిగిన పోటీల్లో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న సమయంలో 19 ఏళ్ల సుమిత్ హ్యాంగోవర్ కారణంగా ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు గైర్హాజరయ్యాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అధికారుల అనుమతి లేకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌ను హోటల్ గదికి తీసుకొచ్చాడు. ఈ రెండు చర్యలను ‘ఐటా’ తీవ్రంగా పరిగణించి ఈసారి అతనిపై వేటు వేసింది. ‘స్పెయిన్‌తో పోటీలకు జట్టును ప్రకటించిన అనంతరం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిందేమిటో కూడా కచ్చితంగా తెలీదు. ఆ తర్వాత అసలు విషయాలు తెలిసి ఇప్పుడు జట్టుకు ఎంపిక చేయలేదు’ అని ‘ఐటా’ వర్గాలు పేర్కొన్నాయి.