తొలి రౌండ్‌లో ప్రపంచ 564వ ర్యాంకర్ చేతిలో ఓటమి
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డ 27 ఏళ్ల నగాల్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 3–6, 3–6తో ప్రపంచ 564వ ర్యాంకర్ యిబింగ్ వు (చైనా) చేతిలో ఓడిపోయాడు.
79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. కేవలం రెండు విన్నర్స్ కొట్టిన నగాల్ ఎనిమిది అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 23,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 52 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తర్వాత నగాల్ గాయం కారణంగా కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు.
స్వీడన్‌తో డేవిస్ కప్ మ్యాచ్ ఆడాల్సిన సమయంలో నగాల్ వెన్నునొప్పి కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. నగాల్ గైర్హాజరీ అంశం వివాదాస్పదమైంది. డేవిస్ కప్‌లో జాతీయ జట్టుకు ఆడాలంటే 50 వేల డాలర్ల వార్షిక ఫీజు తనకు చెల్లించాలని నగాల్ డిమాండ్ చేసినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment