Shanghai Open Masters Series
-
పోరాడి ఓడిన బోపన్న జోడీ
షాంఘై: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు మరో టోర్నీలో నిరాశ ఎదురైంది. షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ బోపన్న–డోడిగ్ జోడీ 6–7 (5/7), 6–2, 12–14తో ‘సూపర్ టైబ్రేక్’లో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నికోలా మెక్టిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–డోడిగ్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న–డోడిగ్‌లకు 34,100 డాలర్ల (రూ. 28 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్లో జొకోవిచ్ 6–1, 6–2తో ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలుపొందాడు. టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
నగాల్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ ఏటీపీ–1000 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. నేరుగా మెయిన్ ‘డ్రా’లో పోటీపడ్డ 27 ఏళ్ల నగాల్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 83వ ర్యాంకర్ సుమిత్ నగాల్ 3–6, 3–6తో ప్రపంచ 564వ ర్యాంకర్ యిబింగ్ వు (చైనా) చేతిలో ఓడిపోయాడు. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. కేవలం రెండు విన్నర్స్ కొట్టిన నగాల్ ఎనిమిది అనవసర తప్పిదాలు చేశాడు. సుమిత్‌కు 23,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 లక్షల 52 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తర్వాత నగాల్ గాయం కారణంగా కొన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడు. స్వీడన్‌తో డేవిస్ కప్ మ్యాచ్ ఆడాల్సిన సమయంలో నగాల్ వెన్నునొప్పి కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేకుండాపోయాడు. నగాల్ గైర్హాజరీ అంశం వివాదాస్పదమైంది. డేవిస్ కప్‌లో జాతీయ జట్టుకు ఆడాలంటే 50 వేల డాలర్ల వార్షిక ఫీజు తనకు చెల్లించాలని నగాల్ డిమాండ్ చేసినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఆరోపించింది. -
షాంఘై ఓపెన్ చెస్ టోర్నీ విజేత లలిత్
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు షాంఘై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. చైనాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో లీ డి (చైనా), దాయ్ చాంగ్రెన్ (చైనా)లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లలిత్ బాబుకు టాప్ ర్యాంక్ దక్కింది. రెండో స్థానంలో లీ డి... మూడో స్థానంలో దాయ్ చాంగ్రెన్ నిలిచారు. ఐదు గేముల్లో గెలిచిన లలిత్... నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. -
వారెవ్వా ఫెడరర్...
షాంఘై (చైనా): ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన ఖాతాలో ఆరో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో 36 ఏళ్ల ఫెడరర్ చాంపియన్‌గా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెడరర్ 6–4, 6–3తో విజయం సాధించాడు. 72 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 10 ఏస్‌లను సంధించడంతోపాటు ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. అంతేకాకుండా నాదల్కు ఒక్కసారి కూడా తన సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరోవైపు నాదల్ సర్వీస్‌ను ఈ స్విస్ స్టార్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11,36,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.7 కోట్ల 35 లక్షలు) 1000 ర్యాంకింగ్ పాయింట్లు, రన్నరప్ నాదల్కు 5,57,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.3 కోట్ల 60 లక్షలు) 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ♦ ఫెడరర్ కెరీర్లో ఇది 27వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌కాగా ఓవరాల్‌గా 94వ టైటిల్. ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ (94) సరసన ఫెడరర్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అమెరికా స్టార్ జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. ♦ నాదల్‌పై ఫెడరర్‌కిది వరుసగా ఐదో విజయం. ఇప్పటివరకు నాదల్‌తో 38 సార్లు తలపడ్డ ఈ స్విస్ స్టార్ 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 23 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ♦ ఈ సీజన్లో ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మయామి, హాలె ఓపెన్, వింబుల్డన్, షాంఘై ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. ఈ గెలుపుతో హార్డ్ కోర్టులపై ఫెడరర్ విజయాల సంఖ్య 700కు చేరింది. -
బోపన్న- కుబోట్ జంట ముందంజ
షాంఘై: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన భాగస్వామి లుకాస్ కుబోట్ (పోలండ్)తో కలిసి షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-కుబోట్ ద్వయం 6-4, 7-5తో మాక్స్ మిర్నీ (బెలారస్)-ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) జంటపై గెలిచింది. సెమీస్‌లో మార్సెలో మెలో (బ్రెజిల్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడీతో బోపన్న జంట ఆడుతుంది. ఇదే టోర్నీలో లియాండర్ పేస్ (భారత్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట తొలి రౌండ్లోనే ఓడింది.