
ధోని సేన సిరీస్ గెలిచినా..
విశాఖ:న్యూజిలాండ్ సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆ జట్టును టెస్టుల్లో క్లీన్ స్వీప్ చేసి నంబర్ ర్యాంకును సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను 3-2 తో ముగించడంతో ర్యాంకులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్లో ధోని సేన నాల్గో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ వన్డే సిరీస్కు ముందు నాల్గో స్థానంలో భారత జట్టు బరిలోకి దిగగా, న్యూజిలాండ్ మూడో స్థానంలో పోరుకు సిద్ధమైంది. అయితే న్యూజిలాండ్పై వన్డే సిరీస్ ను మ్యాచ్ తో తేడాతో భారత్ గెలవడంతో ఆ జట్టు నుంచి వన్డే ర్యాంకును మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ఇరు జట్లు తమ తమ స్థానాల్లో పదిలంగా ఉన్నాయి.
ఈ సిరీస్ తరువాత భారత క్రికెట్ జట్టు కేవలం ఒక రేటింగ్ పాయింట్ మాత్రమే మెరుగుపరుచుకోగా, అదే సమయంలో న్యూజిలాండ్ ఒక పాయింట్ ను మాత్రమే చేజార్చుకుంది. ఇప్పుడు భారత జట్టు 111 రేటింగ్ పాయింట్లతో నాల్గో స్థానంలోనే కొనసాగుతుండగా, న్యూజిలాండ్ 112 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలోనే ఉంది. ఈ సిరీస్ను భారత్ 4-1తో గెలిచి ఉంటే వన్డే ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిలిచేది. ప్రస్తుతం భారత జట్టుకు వన్డే మ్యాచ్లు లేకపోవడంతో చాలా కాలం ఇదే స్థానంలో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డేల్లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో, దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.