టోక్యో: వచ్చే ఏడాదివరకల్లా కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేసే ప్రసక్తే లేదని... వాటిని రద్దు చేస్తామని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ యొషిరో మోరి స్పష్టం చేశారు. కంటికి కనిపించని ఈ వైరస్ మొత్తం ప్రపంచాన్నే తన గుప్పిట పెట్టుకొని వణికిస్తోంది. రోజురోజుకీ జడలు విప్పుతున్న ఈ వైరస్ ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, వైద్య నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటివరకు వ్యాక్సినే లేని కరోనా వైరస్ ఏడాదికల్లా తగ్గుముఖం పట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ మోరి జపాన్‌కు చెందిన క్రీడాపత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడుతూ... మహమ్మారి అదుపులోకి రాకపోతే తిరిగి 2022కు వాయిదా వేసే ప్రణాళిక ఏదీ లేదని, టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయడం తప్పదని అన్నారు. ఒలింపిక్స్ చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా గేమ్స్‌ను రద్దు చేసిన విషయాన్ని మోరి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా కంటికి కనపడని శత్రువుపై ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోందని చెప్పుకొచ్చారు.
ఒకవేళ వైరస్‌ను కట్టడి చేస్తే వచ్చే వేసవిలో ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. గేమ్స్ అధికార ప్రతినిధి మసా టకయా మాట్లాడుతూ... రద్దయ్యే అవకాశాల్ని కొట్టిపారేశారు. చైర్మన్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవని చెప్పారు. అయితే వైద్య వర్గాల హెచ్చరికలు మాత్రం ఆర్గనైజింగ్ కమిటీ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. జపాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యొషితకె యొకొకుర మాట్లాడుతూ ‘గేమ్స్ వద్దేవద్దని నేను చెప్పట్లేదు. కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోయినా నిర్వహిస్తే అది అత్యంత ప్రమాదకరమవుతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment