
అలిస్టర్ కుక్
సౌతాంప్టన్ : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌పై భారత అభిమానుల ఆగ్రహంగా ఉన్నారు. కోహ్లి సేనతో జరిగే చివరి టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించిన ఈ ఇంగ్లీష్ ఆటగాడు.. 11 మంది సభ్యులతో కూడిన తన ఆల్‌టైమ్ టెస్ట్ జట్టును ప్రకటించాడు. తనతో కలిసి ఆడిన ఆటగాళ్లు, ప్రత్యర్థి ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టు ఎంపిక చేసినట్లు తెలిపాడు. తన జట్టులో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు మిస్సయ్యారని, వారందరికీ క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈ జట్టులో భారత క్రికెటర్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇదే భారత అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
తన ఆల్‌టైమ్ టీమ్ కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహమ్ గూచ్‌ను సూచించిన కుక్.. అతనికి ఓపెనింగ్ జంటగా ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను ఎంపిక చేశాడు. ఇక బ్యాట్స్‌మన్‌గా దిగ్గజ ఆటగాళ్లు బ్రియన్ లారా(వెస్టిండీస్), రికీ పాంటింగ్(ఆసీస్), ఏబీ డివిలియర్స్, జాక్వస్ కల్లీస్ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర(శ్రీలంక)లను పేర్కొన్నాడు. బౌలర్స్‌గా ఇద్దరు స్పిన్నర్లు ముత్తయ్య మురళిదరణ్(శ్రీలంక), షేన్ వాట్సన్(ఆసీస్)లతో పేసర్స్ జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), గ్లేన్ మెక్‌గ్రాత్ (ఆసీస్)లను ఎంపిక చేశాడు. ఇక ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో 32 సెంచరీలతో అత్యధిక పరుగులు 12,254 చేసిన తొలి ఆటగాడిగా కుక్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లిసేన 5 టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment