నాదల్ జోరుకు బ్రేక్
బీజింగ్: ఈ ఏడాది హార్డ్ కోర్టు సీజన్‌లో వరుసగా 22 విజయాలతో జోరుమీదున్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి ఓటమి ఎదుర్కొన్నాడు. ఆది వారం జరిగిన చైనా ఓపెన్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో నాదల్‌ను ఓడించి నాలుగోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సెర్బియా స్టార్ 2009, 2010, 2012లలో ఈ టైటిల్ గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 5,57,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 41 లక్షలు) లభిం చింది. ఈ ఫలితంతో సంబంధం లేకుండా నాదల్ సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. జొకోవిచ్ రెండో స్థానానికి పడిపోనున్నాడు.
సెరెనాకు 56వ టైటిల్
ఇదే టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6-2, 6-2తో జంకోవిచ్ (సెర్బియా)పై గెలిచింది. ఈ ఏడాది పదో టైటిల్ నెగ్గిన సెరెనా తన కెరీర్ టైటిల్స్ సంఖ్యను 56కు పెంచుకుంది. సెరెనాకు 8 లక్షల 60 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 27 లక్షలు) దక్కింది. తాజా గెలుపుతో సెరెనా కెరీర్‌లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణుల జాబితాలో ఏడో స్థానానికి చేరుకుంది. మార్టినా నవ్రతిలోవా (167 టైటిల్స్), క్రిస్ ఎవర్ట్ (154), స్టెఫీ గ్రాఫ్ (107) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.