ATP rankings
-
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
భారత టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఏటీపీ మెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానంలో నిలిచాడు.గత వారంలో కెరీర్ బెస్ట్ 77వ ర్యాంకు సాధించిన సుమిత్.. తాజాగా ఆరు స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. పెరూగియా ఓపెన్ ఏటీపీ –125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచి.. మొత్తంగా 777 ఏటీపీ పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.కాగా హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నగాల్... ఇప్పటికే సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెనర్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించిన చరిత్ర సృష్టించిన సుమిత్ నగాల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. భారత నంబర్ వన్‌గా ఉన్న సుమిత్ నగాల్.. ఇటీవల హీల్బ్రాన్ నెకార్కప్-2024 మెన్స్ సింగిల్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత చెన్నై ఓపెన్‌లోనూ విజయం సాధించాడు. ఈ క్రమంలో ఇలా కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు.చదవండి: T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్ -
ఐదేళ్ల తర్వాత...
న్యూఢిల్లీ: నిరీక్షణ ముగిసింది. ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో మళ్లీ భారత ప్లేయర్ పేరు కనిపించింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్–100లోకి దూసుకొచ్చాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 26 ఏళ్ల సుమిత్ 630 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 98వ ర్యాంక్‌లో నిలిచాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఓ భారత టెన్నిస్ ప్లేయర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి రావడం విశేషం. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక భారత్ నుంచి టాప్–100లో నిలిచిన పదో ప్లేయర్‌గా సుమిత్ నగాల్ గుర్తింపు పొందాడు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌కే చెందిన రోహన్ బోపన్న వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ విభాగంలో సానియా మీర్జా కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్‌లో, డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. -
పదేళ్ల తర్వాత కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో బోపన్న
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న పదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్ కు చేరుకున్నాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఈ ప్రదర్శనతో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బోపన్న మూడు స్థానాలు ఎగబాకాడు. 43 ఏళ్ల బోపన్న 2013లో చివరిసారి కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్ ద్వయం ఏడు టోర్నీల్లో ఫైనల్ చేరి రెండింటిలో టైటిల్ నెగ్గి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో కొత్త చరిత్ర సృష్టించిన దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన అగ్ర స్థానాన్ని మళ్లీ అందుకున్నాడు. ఏటీపీ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను 7,595 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. 36 ఏళ్ల జొకోవిచ్ తన కెరీర్లో నంబర్‌వన్‌గా 388వ వారంలోకి అడుగు పెట్టడం విశేషం. ఇప్పటివరకు టాప్‌లో ఉండి సెమీస్‌లో జొకోవిచ్ చేతిలో ఓడిన అల్కరాజ్ రెండో స్థానానికి పడిపోగా, రష్యా ప్లేయర్ ఖచనోవ్ మరోసారి టాప్–10లోకి అడుగు పెట్టాడు. చదవండి: WTC Final: ఔను.. ఇంగ్లండ్‌లోనే ఎందుకు జరగాలి? వేరే పిచ్ పెట్టాల్సిందే.. పెరుగుతున్న మద్ధతు -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండు వారాల క్రితం అతను తన టాప్ ర్యాంక్‌ను స్పెయిన్‌కు చెందిన అల్కరాజ్కు కోల్పోయాడు.అయితే మయామీ ఓపెన్‌లో అల్కరాజ్ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్ కెరీర్ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం. -
చరిత్ర సృష్టించిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్
ట్యురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్పెయిన్ టీనేజర్ కార్లోస్ అల్కరాజ్ కొత్త చరిత్ర లిఖించాడు. 1973లో అధికారికంగా ర్యాంకింగ్స్ మొదలయ్యాక నంబర్‌వన్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించనున్న పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కరాజ్ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా; 2001లో 20 ఏళ్ల 214 రోజులు) పేరిట ఉన్న ఈ రికార్డును అల్కరాజ్ తిరగరాశాడు. గాయం కారణంగా అల్కరాజ్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఈ టోర్నీలో టైటిల్ సాధిస్తే స్పెయిన్ దిగ్గజం, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించేవాడు. కానీ నాదల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న అల్కరాజ్ (6,820 పాయింట్లు) డిసెంబర్ 5న ముగిసే టెన్నిస్ సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించడం ఖరారైంది. ఈ ఏడాదిని 32వ ర్యాంక్‌తో ప్రారంభించిన అతను సెప్టెంబర్ 12న నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఎదిగాడు. పిన్న వయస్కులో టాప్ ర్యాంక్ అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ సంవత్సరం అల్కరాజ్ ఐదు సింగిల్స్ టైటిల్స్ (రియోఓపెన్, మయామి మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ మాస్టర్స్, యూఎస్ ఓపెన్) సాధించాడు. మొత్తం 57 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 76 లక్షల 27 వేల 613 డాలర్ల (రూ. 62 కోట్లు) ప్రైజ్‌మనీ సంపాదించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న 18వ ప్లేయర్ అల్కరాజ్. 2003 తర్వాత బిగ్–4 ప్లేయర్లు (ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే) కాకుండా మరో ప్లేయర్ టాప్ ర్యాంక్‌తో ముగించడం ఇదే ప్రథమం. నాదల్ తర్వాత స్పెయిన్ నుంచి ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. -
వరల్డ్ నంబర్‌వన్‌గా మెద్వెదెవ్
దుబాయ్: రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ టెన్నిస్ ప్రపంచంలో శిఖర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదెవ్కు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ దక్కుతుంది. కెరీర్లో ఒకే ఒక గ్రాండ్‌స్లామ్ నెగ్గిన మెద్వెదెవ్... కఫెల్నికోవ్, మారత్ సఫిన్ తర్వాత అగ్ర స్థానానికి చేరిన మూడో రష్యా ఆటగాడిగా నిలిచాడు. దుబాయ్ ఓపెన్‌లో కనీసం సెమీ ఫైనల్ చేరితే నంబర్‌వన్ ర్యాంక్ నిలబెట్టుకోగలిగే స్థితిలో బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అనూహ్యంగా 4–6, 6–7 (4/7) తేడాతో వరల్డ్ నంబర్ 123 జిరి వెస్లీ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయంపాలై అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫిబ్రవరి 2020నుంచి జొకోవిచ్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఫెడరర్, నాదల్, జొకోవిచ్, ముర్రేని మినహాయించి గత 18 ఏళ్లలో (2004నుంచి) వరల్డ్ నంబర్ స్థానానికి చేరిన తొలి ఆటగాడు కావడం విశేషం. -
ప్రజ్నేశ్@ 97
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ ఆరు స్థానాలు ఎగబాకి 97వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీ తర్వాత గత పదేళ్ల కాలంలో పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లో చోటు పొందిన మరో ప్లేయర్ ప్రజ్నేశే కావడం విశేషం. ‘ఇదో గొప్ప మైలురాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. నేనింకా చాలా లక్ష్యాలు నిర్దేశించుకున్నాను. ఈ సీజన్లో వాటిని అధిగమిస్తానని నమ్మకంతో ఉన్నాను. ఫిట్నెస్ పరంగా, ఆటపరంగా చాలా అంశాల్లో నేను మెరుగవ్వాల్సి ఉంది’ అని తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల ప్రజ్నేశ్ వ్యాఖ్యానించాడు. ప్రజ్నేశ్ టాప్–100లో కొనసాగితే అతనికి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం వస్తుంది. ప్రజ్నేశ్ తర్వాత రామ్‌కుమార్ రామనాథన్ 128వ స్థానంలో, యూకీ బాంబ్రీ 156వ ర్యాంక్‌లో ఉన్నారు. డబుల్స్‌లో రోహన్ బోపన్న 37వ స్థానంలో కొనసాగుతుండగా... దివిజ్ శరణ్ 39వ, లియాండర్ పేస్ 75వ, జీవన్ నెడుంజెళియన్ 77వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోనున్నాడు. కడుపు నొప్పితో పారిస్ మాస్టర్స్ టోర్నీనుంచి రాఫెల్ నాదల్ అనూహ్యంగా తప్పుకోవడంతో సరిగ్గా రెండేళ్ల తర్వాత నొవాక్‌కు నంబర్‌వన్ ఖాయమైంది. 2000లో మారత్ సఫిన్ (38వ ర్యాంక్) తర్వాత సీజన్ ప్రారంభమైనప్పుడు 20కంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉండి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగిస్తున్న తొలి ఆటగాడు జొకోవిచ్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో అతను 22వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. తాజా సింగిల్స్ ర్యాంకుల్లో అతను ఏకంగా 84 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 176వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆదివారం చైనాలో జరిగిన ఏటీపీ చాలెంజర్స్ టోర్నీలో సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా 125 పాయింట్లు పొందిన ప్రజ్నేశ్ టాప్–200 ర్యాంకుల్లో నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో యూకీ బాంబ్రీ రెండు స్థానాలు కోల్పోయి 85వ ర్యాంకుకు పడిపోయినప్పటికీ భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. రామ్‌కుమార్ రామనాథన్ 120వ, సుమిత్ నాగల్ 225వ, అర్జున్ ఖడే 397వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. డబుల్స్‌లో రోహన్ బోపన్న ఒక స్థానం కోల్పోయి 23వ ర్యాంకులో, దివిజ్ శరణ్ రెండు స్థానాలు కోల్పోయి 43వ ర్యాంకులో, లియాండర్ పేస్ కూడా రెండు స్థానాలు కోల్పోయి 50వ ర్యాంకులో ఉన్నారు. ఆటకు దూరమైన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకుల్లో 24వ స్థానానికి పడిపోయింది. ప్రార్థన తొంబరే 164వ ర్యాంకులో ఉంది. -
నాదల్.. నంబర్ వన్
పారిస్: స్సెయిన్ బుల్ రఫెల్ నాదల్ సుదీర్ఘ విరామం తరువాత తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్ లో నాదల్ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో మూడేళ్ల విరామం తరువాత మరొకసారి టాప్ లో నిలిచినట్లయ్యింది. ఈ 31 ఏళ్ల స్పెయిన్ దిగ్గజం చివరిసారిగా 2014 జూన్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇటీవల జరిగిన సిన్సినాటి టోర్నీలో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన నాదల్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ నుంచి స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్, ప్రస్తుత నంబర్‌వన్ ర్యాంకర్ ఆండీ ముర్రే తప్పుకోవడంతో నాదల్ టాప్ ర్యాంక్‌కు మార్గం సుగమమైంది. మరోవైపు పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం కూడా నాదల్ ర్యాంకు మెరుగుకావడానికి కారణమైంది. ప్రస్తుతం 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఉన్న నాదల్.. త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో 7,645 పాయింట్లతో నాదల్ టాప్ లో కొనసాగుతుండగా, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే 7,150 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 7,145 పాయింగ్లతో మూడో స్థానంలో నిలిచాడు. -
మళ్లీ అతనే నెంబర్ వన్
మాడ్రిడ్: ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ జాబితాలో జొకోవిచ్ అగ్రస్థానంలో ఉన్నాడు. బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే, స్విట్జర్లాండ్ ఆటగాడు వావ్రింకా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. జపాన్ ఆటగాడు నిషికోరి నాలుగో స్థానానికి చేరగా, మిలోస్ రయోనిక్ (కెనడా) ఐదో స్థానానికి దిగజారాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆరో స్థానంలో, స్విట్జర్లాండ్ కెరటం రోజర్ ఫెదరర్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) ఏడు, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ఎనిమిది, మారిన్ సిలిక్ (క్రొయేషియా) 10 ర్యాంకుల్లో ఉన్నారు. -
ఏడో ర్యాంక్‌కు నాదల్
పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో దిగజారాడు. తాజా జాబితాలో రఫెల్ మూడు స్థానాలు కోల్పోయి ఏడో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో నాదల్.. బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే చేతిలో ఓటమిపాలయ్యాడు. -
నాదల్ జోరుకు బ్రేక్
బీజింగ్: ఈ ఏడాది హార్డ్ కోర్టు సీజన్లో వరుసగా 22 విజయాలతో జోరుమీదున్న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ తొలి ఓటమి ఎదుర్కొన్నాడు. ఆది వారం జరిగిన చైనా ఓపెన్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-4తో నాదల్‌ను ఓడించి నాలుగోసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సెర్బియా స్టార్ 2009, 2010, 2012లలో ఈ టైటిల్ గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 5,57,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 41 లక్షలు) లభిం చింది. ఈ ఫలితంతో సంబంధం లేకుండా నాదల్ సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. జొకోవిచ్ రెండో స్థానానికి పడిపోనున్నాడు. సెరెనాకు 56వ టైటిల్ ఇదే టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఫైనల్లో సెరెనా 6-2, 6-2తో జంకోవిచ్ (సెర్బియా)పై గెలిచింది. ఈ ఏడాది పదో టైటిల్ నెగ్గిన సెరెనా తన కెరీర్ టైటిల్స్ సంఖ్యను 56కు పెంచుకుంది. సెరెనాకు 8 లక్షల 60 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 27 లక్షలు) దక్కింది. తాజా గెలుపుతో సెరెనా కెరీర్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన క్రీడాకారిణుల జాబితాలో ఏడో స్థానానికి చేరుకుంది. మార్టినా నవ్రతిలోవా (167 టైటిల్స్), క్రిస్ ఎవర్ట్ (154), స్టెఫీ గ్రాఫ్ (107) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.