న్యూఢిల్లీ: నిరీక్షణ ముగిసింది. ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో మళ్లీ భారత ప్లేయర్ పేరు కనిపించింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్–100లోకి దూసుకొచ్చాడు.
సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 26 ఏళ్ల సుమిత్ 630 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 98వ ర్యాంక్‌లో నిలిచాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఓ భారత టెన్నిస్ ప్లేయర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి రావడం విశేషం. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక భారత్ నుంచి టాప్–100లో నిలిచిన పదో ప్లేయర్‌గా సుమిత్ నగాల్ గుర్తింపు పొందాడు.
ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌కే చెందిన రోహన్ బోపన్న వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ విభాగంలో సానియా మీర్జా కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్‌లో, డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment