నాదల్.. నంబర్ వన్
పారిస్: స్సెయిన్ బుల్ రఫెల్ నాదల్ సుదీర్ఘ విరామం తరువాత తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్ లో నాదల్ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో మూడేళ్ల విరామం తరువాత మరొకసారి టాప్ లో నిలిచినట్లయ్యింది. ఈ 31 ఏళ్ల స్పెయిన్ దిగ్గజం చివరిసారిగా 2014 జూన్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు.
ఇటీవల జరిగిన సిన్సినాటి టోర్నీలో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన నాదల్ క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ నుంచి స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్, ప్రస్తుత నంబర్‌వన్ ర్యాంకర్ ఆండీ ముర్రే తప్పుకోవడంతో నాదల్ టాప్ ర్యాంక్‌కు మార్గం సుగమమైంది. మరోవైపు పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం కూడా నాదల్ ర్యాంకు మెరుగుకావడానికి కారణమైంది. ప్రస్తుతం 15 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఉన్న నాదల్.. త్వరలో జరిగే యూఎస్ ఓపెన్ కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో 7,645 పాయింట్లతో నాదల్ టాప్ లో కొనసాగుతుండగా, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే 7,150 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 7,145 పాయింగ్లతో మూడో స్థానంలో నిలిచాడు.