
జొకోవిచ్ ఇంటికి..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో సంచలనం నమోదైంది. పురుషుల టెన్నిస్ సింగిల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ రెండో రోజు గేమ్స్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన పోరులో జొకోవిచ్ 6-7(4/7), 6-7(2/7)తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన పోరులో రెండు సెట్ లూ టై బ్రేక్ కు దారి తీశాయి. అయితే పెట్రో దాటికి జొకోవిచ్ తలవంచతూ ఒలింపిక్స్ నుంచి భారంగా నిష్క్రమించాడు. గత లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతక పోరులో జొకోవిచ్ ను ఓడించిన డెల్ పోట్రో.. మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. దీంతో గోల్డెన్ స్లామ్ సాధించే అవకాశాన్ని జొకోవిచ్ జారవిడుచుకున్నాడు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అనంతరం కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన జొకోవిచ్.. తాజా ఒలింపిక్స్లో స్వర్ణం పతకం గెలిస్తే గోల్డెన్ స్లామ్ అతని సొంతమయ్యేది. కాగా, తొలి రౌండ్లోనే జొకోవిచ్ వెనుదిరగడంతో ఆ అవకాశం కోసం మరో నాలుగు సంవత్సరాల పాటు నిరీక్షించక తప్పదు. ఒలింపిక్స్ నుంచి జొకోవిచ్ నిష్క్రమించడంతో బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే మరోసారి పసిడి రేసులో నిలిచే అవకాశం ఉంది. గత లండన్ ఒలింపిక్స్లో ముర్రే స్వర్ణం సాధించగా, రోజర్ ఫెదరర్ కు రజతం, డెల్ పెట్రోకు కాంస్యం దక్కాయి.