
నేను షాకయ్యా: జొకోవిచ్
రియోడీజనీరో: పలువురు అగ్రశ్రేణి క్రీడాకారులు రియో ఒలింపిక్స్ కు దూరం కావడంపై ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వరల్డ్ టాప్-10 ర్యాంకింగ్స్లో ఉన్న ఐదుగురు టెన్నిస్ క్రీడాకారులు ఒలింపిక్స్ నుంచి ముందుగానే వైదొలగడం తనను ఒకింత షాక్కు గురి చేసిందన్నాడు. ప్రత్యేకంగా టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్తో పాటు, స్టాన్ వావ్రింకా, మిలాస్ రోనిచ్, బెర్డిచ్, డొమినిక్ థీమ్లు ఒలింపిక్స్కు దూరం కావడాన్ని జొకోవిచ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
' టాప్-10 ర్యాంకింగ్స్లో ఉన్న టెన్నిస్ క్రీడాకారులు రియోకు దూరం కావడం ఆశ్చర్య పరిచింది. ఇంతమంది ఒలింపిక్స్కు దూరమవుతారని అస్సలు అనుకోలేదు. వారు అలా దూరం కావడానికి కారణాలు వేరుగా ఉండవచ్చు. ఆ ఆటగాళ్ల నిర్ణయాన్ని కచ్చితంగా గౌరవించాలి. అయినప్పటికీ పోరు ఆసక్తికరంగానే సాగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, నిషాకోరి తదితర దిగ్గజాలు ఒలింపిక్స్లో ఆడుతున్నారు. దీంతో కఠినమైన పోటీ ఉండి తీరుతుంది' అని జొకోవిచ్ తెలిపాడు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అనంతరం జొకోవిచ్ కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో జొకోవిచ్కు గోల్డెన్ స్లామ్ సాధించే అరుదైన అవకాశం కూడా రియో ఒలింపిక్స్ రూపంలోముందుంది. ఈ ఏడాది కెరీర్ గ్రాండ్ స్లామ్ ను సాధించిన జొకోవిచ్.. ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన పక్షంలో గోల్డెన్ స్లామ్ అతని సొంతమవుతుంది. ఇప్పటివరకూ గోల్డెన్ స్లామ్ సాధించిన ఘనత జర్మనీ మాజీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ పేరిటే ఉంది. కాగా, తాజా ఒలింపిక్స్ లో కొంతమంది అగ్రశ్రేణి క్రీడాకారులు ఒలింపిక్స్ దూరం కావడాన్ని జొకోవిచ్ ఎంత వరకూ తనకు అనుకూలంగా మార్చుకుంటాడో వేచి చూడాల్సిందే.