ఆఫర్ ఇంకా ముగిసిపోలేదు!
బీసీసీఐకి 100 మిలియన్ డాలర్లు అదనంగా ఇచ్చేందుకు ఇప్పటికీ ఐసీసీ సిద్ధం
దుబాయ్: ఐసీసీ కొత్త తరహా ఆదాయ పంపిణీ విధానంతో భారీగా నష్టపోనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) ముంగిట పాత అవకాశం మళ్లీ నిలిచింది. తాము ముందుగా ప్రకటించిన విధంగా 100 మిలియన్ డాలర్ల అదనపు మొత్తాన్ని ఇచ్చేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని ఐసీసీ వెల్లడించింది. తమ సమావేశానికి ముందుగా ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు ఐసీసీ సిద్ధమైనా, బీసీసీఐ దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అయితే ఆ ఆఫర్‌ను ఇంకా పూర్తిగా వెనక్కి తీసుకోలేదని ఐసీసీ స్పష్టం చేసింది.
ఐసీసీ సమావేశంలో బుధవారం ఆమోదముద్ర వేసిన విధానం ప్రకారం భారత్‌కు ఎనిమిదేళ్ల కాలానికి (2015–2023) మొత్తం 293 మిలియన్ డాలర్లు దక్కుతాయి. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్ (143), ఆస్ట్రేలియా (132)లకు, భారత్‌కు మధ్య భారీ అంతరం ఉంది. అయినా సరే బీసీసీఐ మాత్రం దీంతో అసంతృప్తిగా ఉంది. తమకు కనీసం 450 మిలియన్ డాలర్లు కావాలని కోరుతోంది. ‘ఐసీసీ తాజా ప్రతిపాదనను బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో చర్చిస్తాం. మేం 393 మిలియన్ డాలర్ల మొత్తానికి గనక అంగీకరిస్తే మేలో జరిగే సమావేశంలో దానికి అధికారిక ముద్ర కల్పిస్తామని ఐసీసీ చెప్పింది’ అని భారత బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
చాంపియన్స్ ట్రోఫీనుంచి తప్పుకునే అవకాశాలు కూడా ఆయన కొట్టి పారేయలేదు. ‘సమస్య పరిష్కారం కావాలంటే మధ్యే మార్గంగా కనీసం 450 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకైనా వారు ముందుకు రావాలి. లేదంటే టోర్నీనుంచి తప్పుకునే విషయంలో బోర్డు నిర్ణయం తీసుకోవచ్చు కూడా. అయితే కోహ్లితో ఆమిర్, ధోనితో స్టార్క్ తలపడే మ్యాచ్‌లు లేకుండా ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తాము అంగీకరించిన మొత్తాన్ని అసలు ఐసీసీకి ఇచ్చేందుకు సిద్ధపడుతుందో లేదో కూడా చూడండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.