చాంగ్‌వాన్ (కొరియా): అంతర్జాతీయ స్థాయిలో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవల కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన భారత షూటర్లు అదే జోరును ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నమెంట్‌గా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో మంగళవారం భారత పిస్టల్ షూటర్ ఓం ప్రకాశ్ మిథర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకొని జగజ్జేతగా అవతరించాడు. 50 మీటర్ల పిస్టల్ విభాగంలో 23 ఏళ్ల ఓం ప్రకాశ్ 564 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఓం ప్రకాశ్ 10 మీ., 50 మీ. ఎయిర్ పిస్టల్ విభాగాల్లో కాంస్యాలు గెలుచుకున్నాడు. దమిర్ వికెట్ (సెర్బియా–562 పాయింట్లు), డెమ్యుంగ్ లీ (దక్షిణ కొరియా–560 పాయింట్లు) రజతం, కాంస్యం నెగ్గారు. అయితే, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుపొందిన జీతూ రాయ్... ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 552 పాయింట్లతో అతను 17వ స్థానంలో నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లేనందున ఎవరికీ ఒలింపిక్ బెర్త్‌లు దక్కలేదు.
ఇక జూనియర్ స్థాయి 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో తాజా ఏషియాడ్ స్వర్ణ విజేత సౌరభ్ చౌదరి, అభిద్న్య పాటిల్ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్ (574 పాయింట్లు) 13వ స్థానంలో, హీనా సిద్ధూ 571 పాయింట్లతో 29వ స్థానంలో నిలిచారు. సోమవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం నెగ్గిన అంజుమ్ మౌద్గిల్, నాలుగో స్థానంలో నిలిచిన అపూర్వీ చండేలాలు భారత్‌కు రెండు ఒలింపిక్ కోటా బెర్త్‌లు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారతీయ షూటర్‌గా ఓం ప్రకాశ్ గుర్తింపు పొందాడు. గతంలో అభినవ్ బింద్రా (2006), మానవ్‌జిత్ సంధూ (2006), తేజస్విని సావంత్ (2010) మాత్రమే ఈ ఘనత సాధించారు.
విశ్వ విజేత ఓం ప్రకాశ్
Published Wed, Sep 5 2018 1:33 AM | Last Updated on Wed, Sep 5 2018 1:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment