మళ్లీ పరుగుల పండుగే !
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో మరోసారి ప్రేక్షకులకు పరుగుల వినోదం దక్కనుంది. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలాగే ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. నగరంలో మూడేళ్ల తర్వాత రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనున్న వన్డే కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేశారు. ఆదివారం జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్న నేపథ్యంలో మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మ్యాచ్ కోసం గత రెండు రోజులుగా పిచ్‌ను సిద్ధం చేశారు. అందుబాటులో ఉన్న ఆరు వికెట్‌లలో మూడో వికెట్‌పై ఈ మ్యాచ్ జరగనుంది. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఇటీవల ఈ పిచ్‌పైనే ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. సాధారణ మరమ్మతుల తర్వాత ఈ స్టేడియంలో కొత్త సీజన్‌లో ఇప్పటివరకు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా నిర్వహించలేదు. అవుట్‌ఫీల్డ్ కూడా వేగంగా ఉండవచ్చు.
ఒక విజయం... మూడు ఓటములు
గతంలో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నాలుగు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్ 1 గెలిచి, 3 ఓడింది. ఆ మ్యాచ్‌లను ఒక సారి గుర్తు చేసుకుంటే...
1. భారత్-దక్షిణాఫ్రికా (16 నవంబర్, 2005): దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యువరాజ్ (103) సెంచరీ సహాయంతో భారత్ 249 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో లక్ష్యం అందుకుంది. కలిస్ (68 నాటౌట్) టాప్‌స్కోరర్.
2. భారత్-ఆస్ట్రేలియా (5 అక్టోబర్, 2007): 47 పరుగులతో ఆసీస్ విజయం. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సైమండ్స్ (89)తో పాటు హేడెన్, క్లార్క్ అర్ధ సెంచరీతో ఆస్ట్రేలియా 290 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 243 పరుగులకే ఆలౌటైంది. ఈసారి కూడా యువరాజ్ (121) సెంచరీ వృథా అయింది.
3. భారత్-ఆస్ట్రేలియా (5 నవంబర్, 2009): ఈ సారీ ఆసీస్‌దే గెలుపు. షాన్ మార్ష్ (112) సెంచరీ, వాట్సన్ (93) దూకుడుతో ఆస్ట్రేలియా 350 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సచిన్ (175) తన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌లో ఒకటి ఆడటంతో విజయానికి చేరువగా వచ్చినా...3 పరుగులతో భారత్ పరాజయం పాలైంది.
4. భారత్-ఇంగ్లండ్ (14 అక్టోబర్, 2011): ఉప్పల్‌లో భారత జట్టు బోణీ చేసింది. 126 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ధోని (87 నాటౌట్) జోరుతో భారత్ 300 పరుగులు సాధించింది. అనంతరం ఇంగ్లండ్ 174 పరుగులకే పరిమితమైంది. కుక్ (60)దే అత్యధిక స్కోరు.
‘మేం విండీస్‌తో టెస్టు మ్యాచ్ నిర్వహణ కోసం సిద్ధమవుతున్న సమయంలో సిరీస్ రద్దయింది. సాధారణంగా టెస్టు మ్యాచ్ నిర్వహణ అంటే ఆదాయం కోల్పోవడమే. అదే వన్డే అయితే మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి మాకు మంచే జరిగింది. అన్ని విధాలా చక్కటి సౌకర్యాలతో మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పిచ్ కూడా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందని చెప్పగలను’
- అర్షద్ అయూబ్, హెచ్‌సీఏఅధ్యక్షుడు