ఒక్క చాన్స్ ప్లీజ్..!
అవకాశం కోసం గంభీర్ ఎదురు చూపులు
ధావన్ స్థానంలో తీసుకోవాలనే డిమాండ్
గౌతమ్ గంభీర్... ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెన్‌లో అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్న క్రికెటర్. మూడు టెస్టులు గడిచినా... ఓపెనర్‌గా ధావన్ విఫలమవుతున్నా... ఇప్పటివరకూ గంభీర్‌కు అవకాశం రాలేదు. రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న గంభీర్ తనని తాను నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం మిగిలిన రెండు టెస్టులు. మరి మాంచెస్టర్‌లో అయినా తనకు చాన్స్ దక్కుతుందా..!
సాక్షి క్రీడావిభాగం: ఇంగ్లండ్‌లో టెస్టు గెలవాలంటే ఏ జట్టుకైనా ఓపెనర్లు అత్యంత కీలకం. కొత్త బంతితో స్వింగ్‌తో చెలరేగే అండర్సన్‌ను అడ్డుకోవాలంటే బ్యాట్స్‌మెన్‌కు టెక్నిక్‌తో పాటు అనుభవం కూడా అవసరం.
ఐదు టెస్టుల సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలో ఇదే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గంభీర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ ఇంగ్లండ్‌లో అడుగుపెట్టి నెలరోజులు దాటిపోయినా అవకాశం కోసం గంభీర్ కళ్లుకాయలు కాస్తున్నాయి. లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్‌లో లభించిన మంచి పట్టును ధోనిసేన సౌతాంప్టన్ టెస్టుతో పోగొట్టుకుంది. ఈ సిరీస్‌లో భారత ఓపెనర్ల ప్రదర్శనను గమనిస్తే... విజయ్ తన శైలిని పూర్తిగా వదిలేసి క్రీజులో గంటల తరబడి పాతుకుపోవాలనే లక్ష్యంతో ఆడుతున్నాడు. ఓ రకంగా ఇది ఫలితాన్నిచ్చింది.
కానీ రెండో ఎండ్‌లో శిఖర్ ధావన్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 122 పరుగులు మాత్రమే చేశాడు. తన షాట్ సెలక్షన్ దారుణంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిర్లక్ష్యపు షాట్స్ ఆడాడు. ఇది జట్టు మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఒకవేళ లార్డ్స్ టెస్టులో గెలిచిన జట్టును మార్చడం ఇష్టంలేక మూడో మ్యాచ్‌కు ధావన్‌ను కొనసాగించారని అనుకుంటే... ఇప్పటికైనా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. అనుభవం ఉన్న గంభీర్‌ను తీసుకోకపోతే భారత్ కచ్చితంగా మరో తప్పు చేసినట్లే.
కసి మీద ఉన్నాడు
నాగ్‌పూర్ (2012)లో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత మళ్లీ గంభీర్‌కు జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఫామ్ కోసం శ్రమించి, రంజీలు ఆడాడు. తన పని అయిపోయిందని విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు సెలక్టర్లకు అనుభవజ్ఞుల అవసరం కనిపించింది. దీంతో గంభీర్‌ను పిలిచారు. కానీ ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితం చేశారు. నిజానికి ఓ అవకాశం వస్తే తనని తాను నిరూపించుకోవాలని గౌతీ కసి మీద ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు విఫలమైతే ఇక గంభీర్ అంతర్జాతీయ కెరీర్‌కు దాదాపుగా తెరపడినట్లే. కాబట్టి ఓ అవకాశం ఇస్తే మేలు..!
భారత్‌కు ఉన్న ప్రత్యామ్నాయాలు
నాలుగో టెస్టుకు ముందు భారత్ కచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇషాంత్, భువనేశ్వర్ గాయాల నుంచి కోలుకోలేదు. మాంచెస్టర్‌లో వికెట్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అశ్విన్‌ను ఆడించకపోవడం కూడా పెద్ద తప్పే. కాబట్టి నాలుగో టెస్టుకు ముందు భారత్ ముందున్న ప్రత్యామ్నాయాలను ఓసారి పరిశీలిద్దాం.
1ధావన్ స్థానంలో గంభీర్‌ను తీసుకోవడం. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే రోహిత్‌ను కొనసాగించి, జడేజా స్థానంలో అశ్విన్‌ను తీసుకోవచ్చు. భువనేశ్వర్ స్థానంలో వరుణ్ ఆరోన్‌కు అవకాశం ఇవ్వొచ్చు.
2 ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటే... జడేజా, అశ్విన్‌లను కొనసాగించి... ఇద్దరే పేసర్ల (షమీ, వరుణ్ ఆరోన్)ను ఆడించడం.
3 ఒకవేళ గంభీర్‌ను తీసుకోకుండా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలంటే... పుజారాను ఓపెనర్‌గా పంపి, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను ఒక్కో స్థానం పైకి జరపడం. దీనివల్ల రోహిత్ తుది జట్టులో ఉంటాడు. అదే సమయంలో అశ్విన్, జడేజాలతో పాటు ముగ్గురు పేసర్లు ఉంటారు.