అది మాకు ప్లస్ పాయింట్: ధోని
లాడర్హిల్: ఈ సీజన్ ముగిసే నాటికి భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో తిరిగి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంటుందని పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో భారత క్రికెట్ జట్టుకు పలు టెస్టు సిరీస్లు ఉన్నందున ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానానికి చేరడం ఎంతమాత్రం కష్టం కాదన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు అత్యంత నిలకడగా ఉందని కితాబిచ్చిన ధోని.. ఇప్పుడు జట్టులో ఫాస్ట్ బౌలర్ల సామర్ధ్యం కూడా మరింత పెరిగిందన్నాడు.
'నా దృష్టిలో భారత టెస్టు జట్టు చాలా బాగుంది. అదే సమయంలో టీ 20, వన్డేల్లో కూడా జట్టు పటిష్టంగానే ఉంది. ప్రత్యేకంగా బ్యాటింగ్లో అత్యంత అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు. గత రెండున్నర సంవత్సరాల నుంచి చూస్తే, భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్లో పెద్దగా మార్పులు కనబడటం లేదు. ఇదే మా బ్యాటింగ్ బలాన్ని సూచిస్తుంది. ఎప్పటికప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. రాబోవు రోజుల్లో టీమిండియాకు చాలా టెస్టు సిరీస్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో బౌలర్లంతా ఫిట్గా ఉన్నారు. ప్రధానంగా 10 మంది కచ్చితమైన బౌలర్లు ఉన్నారు. అది మాకు లభించిన ఆస్తే కాదు.. మా ప్లస్ పాయింట్ కూడా. ఇలా బౌలర్ల బలంగా మెండుగా ఉండటంతో వారిని రొటేషన్ పద్ధతిలో పరీక్షించే వీలుంది' అని ధోని తెలిపాడు. తమ జట్టులో ఉన్న టాలెంట్ ఇప్పుడు ప్రదర్శన రూపంలో కనబడుటం నిజంగా గర్వించదగ్గ విషయమన్నాడు.