
వ్యాపారంలోనూ మన క్రికెటర్ల జోరు
కాదేదీ వ్యాపారానికి అనర్హం... భారత క్రికెటర్లకు ఈ విషయం బాగా తెలుసు. తమకు తెలిసిన విద్యతో పాటు తెలియని విద్యలోనూ వ్యాపారాలు చేయడంలో మనోళ్లు పండిపోయారు. క్రికెట్ అకాడమీలు, రెస్టారెంట్లు, సెలూన్లు, దుస్తులు, స్కూళ్లు... ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల వ్యాపారాల్లో ఎవరో ఒకరు ఓ చేయి వేస్తున్నారు. రిటైరైన వాళ్లే కాదు. ఇంకా ఆటలో కొనసాగుతున్న వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. తమకున్న క్రేజ్ ఆ వ్యాపారానికి జతకావడంతో దాదాపుగా అందరూ సక్సెస్ అయ్యారు.... అవుతున్నారు కూడా..!
మన దేశంలో సినిమా స్టార్స్‌కు దీటుగా సంపాదించేది క్రికెటర్లు. ధోని, కోహ్లి లాంటి వాళ్లయితే సినిమా స్టార్స్‌ను మించి సంపాదిస్తారు. భారత జట్టు తరఫున ఒక్కసారి ఆడితే చాలు కావలసినంత డబ్బు. రంజీ క్రికెటర్లే బోలెడు సంపాదిస్తుంటే... ఏడేళ్లుగా ఐపీఎల్ నుంచి వస్తున్న డబ్బు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. చాలామంది క్రికెటర్లు తమకు వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే, కొంతమంది షేర్ మార్కెట్‌నూ ఓ పట్టుపడుతున్నారు. వందలాది మంది భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లలో నేరుగా వ్యాపారం చేసే వాళ్లు తక్కువే. రిస్క్ తీసుకోకుండా ఎక్కడో భవనాలు, స్థలాలు కొనేవాళ్ల సంఖ్యే ఎక్కువ. మైదానంలో సక్సెస్‌ఫుల్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుని, ఎండార్స్‌మెంట్స్‌తో ఎడాపెడా సంపాదిస్తూ, వ్యాపారంలోనూ రాణిస్తున్న కొందరిపై ఓ లుక్కేద్దాం. -సాక్షి క్రీడావిభాగం
ఎం.ఎస్.ధోని
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తనది. క్రీడాకారుల ఎండార్స్‌మెంట్స్‌ను పర్యవేక్షించే రితీ స్పోర్ట్స్ అనే సంస్థలో ధోని భాగస్వామి. స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో జిమ్‌లు ఏర్పాటు చేశాడు. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ లీగ్‌లో చెన్నయిన్ జట్టులో భాగస్వామి. ఇండియన్ హాకీ లీగ్‌లో రాంచీ రేస్ జట్టులో వాటా ఉంది. బైక్ రేసింగ్ సూపర్ స్పోర్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ రేసింగ్ టీమ్‌లోనూ వాటా ఉంది. క్రికెట్ అకాడమీ త్వరలో ప్రారంభించబోతున్నాడు.
కపిల్‌దేవ్
దశాబ్దన్నర క్రితమే కపిల్‌దేవ్ చండీగఢ్‌లో రెస్టారెంట్స్ ప్రారంభించారు. జికామ్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీలో వాటా ఉంది. దేవ్ మస్కో లైటింగ్ పేరుతో స్టేడియాలలో ఏర్పాటు చేసే ఫ్లడ్‌లైట్లు తయారు చేస్తున్నారు.
జహీర్ ఖాన్ రెస్టారెంట్స్, అనిల్ కుంబ్లే టెక్నాలజీ కంపెనీ, రైనాకు హాకీ జట్టులో వాటా, సెహ్వాగ్ స్కూల్స్, రెస్టారెంట్స్... ఇలా దాదాపు ప్రముఖ క్రికెటర్లంతా ఏదో ఒక చిన్నా చితకా వ్యాపారం చేస్తూనే ఉన్నారు. క్రికెటర్లగా వీళ్లకు ఉండే ఇమేజే తొలి పెట్టుబడి. చాలా వ్యాపారాల్లో క్రికెటర్లు డబ్బు పెట్టరు. వేరే ఎవరో పెట్టుబడి పెడితే, వీళ్లు ఆ వ్యాపారం అభివృద్ధి కోసం తమ బ్రాండ్ ఇమేజ్‌ను ఇవ్వడం ద్వారా వాటా తీసుకుంటారు. మొత్తం మీద క్రికెటర్‌గా మైదానంలో పరుగుల వరద పారిస్తే... వ్యాపారంలోనూ కాసుల వర్షమే..!
విరాట్ కోహ్లి
ధోని బాటలోనే జిమ్‌ల వ్యాపారంలోకి వచ్చాడు. చిసెల్ పేరుతో దేశవ్యాప్తంగా జిమ్‌ల చెయిన్ ఏర్పాటు చేశారు. ఫుట్‌బాల్‌లో ఐఎస్‌ఎల్ లీగ్‌లో గోవా జట్టులో వాటా ఉంది. అలాగే ఆన్‌లైన్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. రాగన్ పేరుతో కోహ్లి కంపెనీ దుస్తులు మార్కెట్‌లో ఉన్నాయి.
సునీల్ గవాస్కర్
దేశంలో క్రీడలతో సంబంధం ఉన్నవాళ్లందరికీ సుపరిచితం ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (పీఎంజీ). క్రీడాకారుల మార్కెటింగ్ వ్యవహారాలు చూడొచ్చని తొలుత నేర్పింది గవాస్కర్. 1985 నుంచి ఈ కంపెనీ ఉంది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో ముంబై జట్టులో వాటా ఉంది.
సచిన్ టెండూల్కర్
రెస్టారెంట్స్, క్రీడాపరికరాలు, దుస్తులు ఇలా అనేక వ్యాపారాల్లో సచిన్‌కు వాటాలు ఉన్నాయి. ముసాఫిర్ ట్రావెల్ పోర్టల్, స్మాష్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్‌డ్రైవ్ సచ్ హెల్త్‌కేర్ ఉత్పత్తులు, యూనివర్సల్ కలెక్టబిలియా పేరుతో సెలబ్రిటీస్ మర్కండైజ్ ఇలా రకరకాల వ్యాపారాల్లో తన చేయి ఉంది. ఐఎస్‌ఎల్‌లో కొచ్చి జట్టులో వాటా, అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ జట్టులో వాటా ఉన్నాయి.
యువరాజ్ సింగ్
యువీకెన్ వెంచర్స్ పేరుతో రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. తాజాగా వ్యోమో అనే యాప్‌లో డబ్బులు పెట్టాడు. స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు ఈ యాప్ ద్వారా నేర్పిస్తారు. పలు నగరాల్లో క్రికెట్ అకాడమీలు కూడా ప్రారంభించాడు.
రాబిన్ ఉతప్ప
రెండేళ్ల క్రితమే ఐటిఫిన్ అనే సంస్థను బెంగళూరులో స్థాపించాడు. బ్రౌన్ రైస్, రోటీస్‌తో కూడిన లంచ్ బాక్స్‌ను సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఈ సంస్థ ఇస్తుంది. నెలకు రూ. 2000 తీసుకుని లంచ్ అందిస్తారు. ఈ సంస్థకు బెంగళూరులో మంచి ఇమేజ్ వచ్చింది.
సౌరవ్ గంగూలీ
గంగూలీకి కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి. అయినా తను సొంతంగా విద్యకు సంబంధించిన వ్యాపారం భారీ ఎత్తున చేసే ప్రణాళికలో ఉన్నాడు. ఇందుకోసం ఐఐఎమ్ గ్రాడ్యుయేట్‌ను ఇప్పటికే తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్‌లో కోల్‌కతా జట్టుకు సహ యజమాని. 3డి ప్రింటింగ్‌లోనూ గంగూలీ వ్యాపారం చేస్తున్నాడు.