స్టెప్స్ వేస్తున్న రణ్‌వీర్‌సింగ్, జీవా
సినిమా: సినిమా, క్రికెట్ ఈ రెండింటిలో దేనికి క్రేజ్ అని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. అంత శక్తివంతమైనవి. ప్రజలను ఎంటర్‌టెయిన్ చేసేవి ఈ రెండు. అలాంటి రెండు రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపైకి వస్తే ఆ వేడుకను చూడతరమా? అలాంటి వేడుకనే శనివారం సాయంత్రం చెన్నైలో అభిమానులను కనువిందు చేసింది. 1983 భారత క్రికెట్ క్రీడారంగానికి చరిత్రలో మరచిపోలేని సంవత్సరంగా లిఖించబడింది. ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సువర్ణాక్షరాల సంవత్సరం అది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్ సారథ్యంలో ఆ కప్‌ను సాధించింది. అలాంటి క్రికెట్ క్రీడాకారుడు బయోపిక్‌గా ఇప్పుడు తెరకెక్కుతున్న చిత్రం 83. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున వంటి సినీ స్టార్, తమిళంలో కమలహాసన్ వంటి విశ్వనటుడు విడుదల హక్కులను పొంది విడుదల చేయనుండడం మరో విశేషం. ఈ క్రేజీ చిత్ర తమిళ వెర్షన్ ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక సత్యం థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ క్రీడాస్టార్స్ కపిల్‌దేవ్, కృష్ణమాచార్య శ్రీకాంత్, సినీ స్టార్ కమలహాసన్, చిత్ర హీరో రణ్‌వీర్‌సింగ్, నటుడు జీవా విచ్చేశారు. ఈ సందర్భంగా 83 చిత్ర కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్ మాట్లాడుతూ ఇంత ఘనస్వాగతానికి ధన్యవాదాలన్నారు. తనకిది చెన్నైలో తొలి పయనం అని పేర్కొన్నారు.
ఈ వేదికపై కమలహాసన్‌తో ఉండడం ఘనంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రమే మాయాజాలం అని అన్నారు. దర్శకుడు కబీర్‌ఖాన్ తెరపై ఎప్పుడూ మాయాజాలం సృష్టిస్తారన్నారు. ఆయన ఈ చిత్ర కథ చెప్పినప్పుడు చాలా ఆశ్యర్యపోయానన్నారు. 1983లో భారతదేశం ప్రపంచకప్‌ను గెలిచిన చారిత్రక ఘట్టం అన్నారు దాన్ని తాము ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చామని రణ్‌వీర్‌సింగ్ పేర్కొన్నారు. శ్రీకాంత్ పాత్రలో నటించిన నటుడు జీవా మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం ఇదే వేదికపై కమలహాసన్ తనను పరిచయం చేశారన్నారు. ఇప్పుడు ఇక్కడ నిలబడడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రలో తనను నటించమని దర్శకుడు చెప్పినప్పుడు తాను ఆ పాత్రను చేయగలనా అన్న భయం కలిగిందన్నారు. అయితే చిత్ర యూనిట్ అంతా అండగా నిలిచారని, ఈ పాత్ర కోసం 6 నెలలు శిక్షణ తీసుకున్నట్లు జీవా తెలిపారు. 83లో ప్రపంచకప్ సాధించిన జట్టు కెప్టెన్ కపిల్‌దేవ్ మాట్లాడుతూ తనతో ఉన్న 83 జట్టుకు మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇప్పుడు దాన్ని మళ్లీ తెరపై ఆవిష్కరిస్తున్న అందరికీ కృతజ్ఞతలన్నారు. తమిళనాడుకు వచ్చినప్పుడు తాను తమిళ భాషను నేర్చుకోవాలని ఆశపడ్డానన్నారు. అంత అందమైన భాష అని, ఐలవ్‌యూ చెన్నై అని పేర్కొన్నారు. ఇక్కడ తమతో ఉన్న కమలహాసన్‌కు ధన్యవాదాలన్నారు.
శ్రీకాంత్ అప్పుడూ చాలా సరదాగా, ఉత్సాహంగా ఉండేవారని అన్నారు. అయితే కప్‌ను గెలిచినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి జట్టును పరిచయం చేసినప్పుడు చాలా గంభీరంగా మారపోయారని, ఆ తరువాత మళ్లీ తనదైన బాణీకి వచ్చేశారని చెప్పారు. ఈ చిత్రం పలు జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని, అంతగా సాధ్యం చేసిన అందరికీ ధన్యవాదాలని అన్నారు. నటుడు కమలహాసన్ మాట్లాడుతూ ఇది చాలా అరుదైన తరుణం అని పేర్కొన్నారు. ఇంతమంది ప్రతిభావంతుల మధ్య నిలబడడం గర్వంగా ఉందన్నారు. 83లో ప్రపంచ కప్‌ను గెలవడం మాత్రమే మనకు తెలుసని, అయితే దర్శకుడు కబీర్‌ఖాన్ దాని వెనుకనున్న ఎవరికీ తెలియని కథలను ఈ చిత్రంలో చూపించారని చెప్పారు. అది చాలా అద్భుతంగా ఉందన్నారు. వారు ఎన్ని కష్టాలను అధిగమించి గెలిచారన్నది కథ విన్న తరువాత సూపర్ హీరోలుగా వస్తున్న అవేంజర్స్ కథ కంటే ఇదే నిజమైన సూపర్ హీరోల కథ అని అనిపించిందన్నారు. ఈ చిత్రాన్ని నిజం చేసిన అందరికీ శుభాభినందనలన్నారు. కపిల్‌దేవ్‌కు నిజమైన అభినందన ఇంకా లభించలేదన్నారు. అయితే ఆయన అందుకు బాధపడరని అన్నారు. అదే విధంగా ఆయన కీర్తీ ఎప్పటికీ సజీవం అన్నారు. ఇకపోతే క్రికెట్ క్రీడాకారుడు శ్రీకాంత్‌ను తన చిత్రంలో నటింపజేయాలని ఆశించానని, అది జరగలేదని అన్నారు. ఆయన తనకు చాలా కాలంగా మంచి మిత్రుడని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన వారందరికీ అభినందనలన్నారు. ముఖ్యంగా కబీర్‌ఖాన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కమలహాసన్ ప్రశంసించారు. కాగా ఈ వేదికపై నటుడు రణవీర్‌సింగ్, జీవా ఆడి పాడి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment