సాక్షి క్రీడా విభాగం : కోహ్లి పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాక భారత జట్టు ఉపఖండంలో లేదంటే వెస్టిండీస్ గడ్డపైనే టెస్టు మ్యాచ్‌లు ఆడింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో విండీస్ వేదికలు కూడా పేస్‌కు అనుకూలించకుండా నిర్జీవంగా మారాయి. కాబట్టి భారత్‌లోని మైదానాలకు, అక్కడి పిచ్‌లకు పెద్ద తేడా లేకుండా పోయింది. ఇలాంటి చోట మన పేస్ బౌలర్లకు ఎప్పుడూ పరీక్ష ఎదురు కాలేదు. వికెట్లు తీయాలంటూ వారిపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో పాటు ఒక క్రతువు నిర్వహించినట్లే కొన్ని ఓవర్లు వేసి తప్పుకోవడం రొటీన్‌గా మారిపోయింది. ఆ తర్వాత అశ్విన్, జడేజాలు మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకొని విజయంవైపు సాగిపోవడం మనకు దాదాపు అన్ని సిరీస్‌లలో కనిపించిన ఒకే తరహా దృశ్యం. తాము విఫలమైనా స్పిన్నర్లు ఆదుకోగలరనే ధీమాతో పేస్ బౌలర్లపై ఒత్తిడి కూడా పెరగలేదు. విదేశాల్లో స్పిన్నర్ల వల్ల సాధ్యం కాని చోట ప్రధాన బాధ్యతను మోయలేక మన ఫాస్ట్ బౌలర్లు గతి తప్పారు. ఫిట్‌నెస్ సమస్యలు, చివరి సెషన్‌కు వచ్చే సరికి ఓపిక లేక డస్సిపోయి కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. విదేశాల్లో గత కొన్ని టెస్టులు చూస్తే ఇది అర్థమవుతుంది. జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 136 ఓవర్లు... వెలింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై 210 ఓవర్లు వేసినా ఆలౌట్ చేయలేక పోవడం... నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్ ఆఖరి వికెట్‌కు ఏకంగా 198 పరుగులు జోడించడం... బ్రిస్బేన్‌లో చివరి నలుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్ కలిసి 195 పరుగులు జత చేసి టీమ్ స్కోరును రెట్టింపు చేయడం దానికి ఉదాహరణలు. ఈ అన్ని సందర్భాల్లోనూ భారత్ గెలిచే అవకాశమున్నా... దానిని కోల్పోయింది.
కోహ్లి భిన్నంగా...
ధోని కెప్టెన్సీలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలలో కలిపి 2 టెస్టులు గెలిచి 13 ఓడింది. ఇందులో ఒక్క 2010 డర్బన్ టెస్టులో మాత్రం భారత్ పూర్తిగా పేస్ బౌలింగ్ సత్తాతో గెలిచింది. 2014 లార్డ్స్ టెస్టులో ఇషాంత్ బాగా బౌలింగ్ చేసినా... అదంతా ధోని చలవే! సరిగ్గా చెప్పాలంటే ఆ ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ను చిన్న పిల్లాడిలా మార్గనిర్దేశనం చేస్తూ బంతి బంతికీ ఒక్కో వ్యూహంతో ధోని ఇంగ్లండ్ ఆట కట్టించాడు. వీటిని మినహాయిస్తే మిగతా సందర్భాల్లో పేస్ బౌలింగ్ పరంగా అద్భుతాన్ని ఆశిస్తూ ధోని ప్రేక్షక పాత్రకే ఎక్కువగా పరిమితమయ్యాడు. బౌలర్లు ప్రభావం చూపించాల్సిన చోట కూడా బ్యాటింగ్‌నే నమ్ముకోగా... మన పేసర్లు అతి సులువుగా, ధారాళంగా పరుగులు ఇచ్చేవారు. అందరూ కలిసి సుదీర్ఘ ఓవర్లు వేసే ప్రయత్నం చేసినా ప్రతీ సిరీస్‌లో ఎవరో ఒకరు గాయపడ్డారు. 2011–12 ఆస్ట్రేలియా సిరీస్‌లో జహీర్ చివరి వరకు కొనసాగినా అతి పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇప్పుడు కోహ్లి అలా వేచి చూసే వ్యక్తి కాదు. సరిగ్గా చెప్పాలంటే ధోని తన ఆటగాళ్లు తమంతట తాముగా కొంత బాధ్యత తీసుకోవాలని, సొంతంగా ఆలోచించాలని భావించేవాడు. కానీ విరాట్ మాత్రం దానిని డిమాండ్ చేస్తున్నాడు. తనకు ఎలా కావాలో గట్టిగా చెప్పి చేయించుకునే రకం అతను. కాబట్టి ఎంతటి కఠినమైన పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేసేందుకు, సుదీర్ఘ స్పెల్స్‌కు బౌలర్లు సిద్ధంగా ఉండాల్సిందే.
ఆట మార్చుకోవాల్సిందే...
ఐదేళ్ల క్రితం 2012 సీజన్‌లో సొంతగడ్డపై భారత్ మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఫాస్ట్ బౌలర్ల ఉనికే దాదాపుగా కనిపించలేదు. టీమ్ ఆడిన సగం మ్యాచుల్లో కూడా ఏ ఒక్క పేసర్ బరిలోకి దిగలేదు. అశ్విన్ వేసిన ఓవర్లలో నాలుగో వంతు కూడా ఒక పేసర్ వేయలేదు. ఆ తర్వాతి విదేశీ పర్యటనల్లో ఇదే జట్టును దెబ్బ తీసింది. ఇప్పుడు సుదీర్ఘంగా సొంతగడ్డపై ఆడిన తర్వాత వరుసగా విదేశీ టూర్లకు భారత్ సిద్ధమవుతోంది. అయితే గతంతో పోలిస్తే ఇటీవల మన పేసర్లు కూడా ఎక్కువగా బౌలింగ్ చేయడం కొంత మెరుగైన విషయం. ఇప్పుడు మన పేసర్లలో అనుభవం పెరగడమే కాదు ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది. రనప్ సమస్య చక్కదిద్దుకున్న తర్వాత షమీలో సత్తా పెరిగింది. దక్షిణాఫ్రికా గడ్డపై షమీ నుంచి కోహ్లి ఎంతో ఆశిస్తున్నాడు. అయితే అతను తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమే కీలకం. బౌలింగ్ చేసే తీరులో చిన్న మార్పు మన పేసర్లకు మరింత అనుకూలంగా మార్చవచ్చు. భారత్‌లో సాధారణంగా నేరుగా స్టంప్స్‌పైకి బంతులు విసిరి మనోళ్లు ఎక్కువగా వికెట్లు రాబట్టారు. మన పేసర్లు పడగొట్టిన వికెట్లలో 45.5 శాతం బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ కావడం దీనికి నిదర్శనం. ఇక్కడి నెమ్మదైన పిచ్‌లపై అది పని చేసింది. అదే దక్షిణాఫ్రికాలో పరిస్థితి భిన్నం. గత పదేళ్లలో దక్షిణాఫ్రికాలో అలాంటి బౌలింగ్‌కు 28 శాతం మాత్రమే వికెట్లు లభించాయి. అక్కడ ఎక్కువగా ఆఫ్ స్టంప్‌పై దాడి చేయాల్సి ఉంటుంది. బయటికి వెళుతూ బ్యాట్ ఎడ్జ్ తీసుకునేలా బంతులు సంధించాలి. దాని కోసం బౌలర్లు లెంగ్త్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు తగిన ఫలితాలు లభిస్తాయి. తుది జట్టులో షమీ, ఇషాంత్ ఖాయం కాగా... మూడో స్థానం కోసం భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంపికైనా ఆడే అవకాశాలు తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అన్ని విధాలా మెరుగైన పేస్ బౌలింగ్ దళమే. అయితే తమపై ఉన్న ఒత్తిడిని అధిగమిస్తే సఫారీ సిరీస్ మనకు చిరస్మరణీయం కాగలదు.
తొలి టెస్టులో స్టెయిన్‌కు నో చాన్స్!
గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ బరిలోకి దిగడం మరింత ఆలస్యం కానుంది. భారత్‌తో శుక్రవారం నుంచి కేప్‌టౌన్‌లో జరిగే తొలి టెస్టు తుది జట్టులో అతనికి అవకాశం లభించకపోవచ్చని స్వయంగా కోచ్ ఒటిస్ గిబ్సన్ వెల్లడించారు. స్టెయిన్ ఫిట్‌గానే ఉన్నా ముగ్గురు పేసర్లతో కూడిన తమ జట్టు కూర్పులో అతనికి స్థానం కష్టమని ఆయన చెప్పారు. దాదాపు ఏడాది తర్వాత వస్తున్న స్టెయిన్ తొలి టెస్టులో ఏదైనా జరిగి మధ్యలోనే తప్పుకునే ప్రమాదం కూడా ఉందన్న గిబ్సన్... పేస్‌కు అనుకూలించే తర్వాతి రెండు టెస్టు వేదికలపై మాత్రం స్టెయిన్ ఉంటాడని సంకేతమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment