
హోబర్ట్: ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసమే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పట్ల మైదానంలో తమ ఆటగాళ్లు మెతక వైఖరిని అవలంబించారని మాజీ సారథి మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలను ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ ఖండించాడు. 2018–19లో జరిగిన టెస్టు సిరీస్‌లో తమ ఆటగాళ్లెవరూ అలా చేయలేదని అతను అన్నాడు. కేప్‌టౌన్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోలుకున్న వైనంతో రూపొందించిన అమెజాన్ డాక్యుమెంటరీలో కోహ్లితో మాటల యుద్ధం చేయవద్దని పైన్ చెబుతున్నట్లుగా ఉంది. కోహ్లి దృష్టిలో మంచిగా ఉంటే ఐపీఎల్ ద్వారా ఆరు వారాల్లో మిలియన్ డాలర్లు పొందవచ్చనేది తమ ఆటగాళ్ల ఆలోచన అంటూ క్లార్క్ విమర్శించాడు.
‘కోహ్లిని ఎలా నిలువరించాలనే విషయంలో జరిగిన చర్చలో భాగంగానే అతడిని ఎక్కువగా రెచ్చగొట్టవచ్చని చెప్పాను. అలా చేస్తే అతను మరింత ప్రమాదకరంగా మారతాడనేది నా ఉద్దేశం, వ్యూహం తప్ప మరొకటి కాదు. అయినా టెస్టు సిరీస్‌లో మా జట్టు సభ్యులు ఎవరూ కావాలని కోహ్లి పట్ల మెతకగా వ్యవహరించడం నేను ఎప్పుడూ చూడలేదు. బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఆస్ట్రేలియా విజ యం కోసమే వారు వంద శాతం శ్రమించారు. ఆ సిరీస్ చూస్తే ఇరు జట్ల మధ్య ఢీ అంటే ఢీ ఘటనలు ఎన్నో జరిగాయి కూడా. నేనెవరినీ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఐపీఎల్‌లో ఏమాత్రం అవకాశం లేదు. అలాంటప్పుడు నేను పోగొట్టుకునేది ఏముంటుంది’ అని పైన్ ఘాటుగా సమాధానమిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment