క్రికెటర్ ఆమిర్పై ప్రశంసల వర్షం
మిర్పూర్: ఆసియాకప్లో పాకిస్తాన్ ఓటమి పాలైనా ఆ దేశ పేస్ బౌలర్ మొహ్మద్ ఆమిర్పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. 84 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ను ఆదిలో గడగడలాడించిన ఆమిర్ ను అటు పాకిస్తాన్ కోచ్ వకార్ యూనిస్తో పాటు, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు అభినందించారు. ఆమిర్ ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని వకార్ స్పష్టం చేశాడు. మ్యాచ్-మ్యాచ్కు ఆమిర్ మరింత రాటుదేలుతున్నాడన్నాడు. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్తో జట్టుకు ఐదేళ్లపాటు దూరం కావడం అతని చేసి తప్పిదం కారణంగానే జరిగిందని వకార్ పేర్కొన్నాడు. అప్పుడు ఆమిర్ ఏదైతే చేశాడో దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడన్నాడు.
మరోవైపు లెంగ్త్తో కూడుకున్నఆమిర్ బౌలింగే అతనికి బలమని ధోని స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా ఆమిర్ ఫుల్ లెంగ్త్ బంతులను వేసిన తీరు అబ్బురపరిచిందన్నాడు. పూర్తి నియంత్రణతో ఆమిర్ బౌలింగ్ చేయడం అతని అడ్వాంటేజ్గా పరిగణించిందన్నాడు. ఆమిర్ తో పాటు మహ్మద్ సమీ కూడా సరైన లెంగ్త్లో బంతులు విసిరడంతో భారత్ ఇబ్బందులను ఎదుర్కొవాల్సివచ్చిందని ధోని తెలిపాడు. అయితే మహ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్లు మాత్రం ఫుల్ లెంగ్త్ బంతులను వేయలేకపోయారన్నాడు. కనీసం స్వింగ్ రాబట్టడంలో కూడా రియాజ్-ఇర్ఫాన్లు విఫలం చెందారని ధోని పేర్కొన్నాడు.