
బులవాయో: వరుస విజయాలతో దూసకపోతున్న పాకిస్తాన్ మరో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్ తొలి వన్డేలో 201 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టును చిత్తుచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాక్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నందించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇమాముల్ హక్ 128(134 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా.. ఫకర్ జమాన్ 60 (70 బంతుల్లో 7 ఫోర్లు) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ పోరాటపటిమను ప్రదర్శించలేదు. పాక్ బౌలర్ల ధాటికి 35 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై భారీ ఓటమిని చవిచూసింది. ఆతిథ్య బ్యాట్స్‌మెన్లలో ర్యాన్ ముర్రే 32 నాటౌట్(48 బంతుల్లో 1 ఫోర్) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికట్లతో అదరగొట్టగా.. ఆష్రాఫ్, ఉస్మాన్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment