ఉత్కంఠ పోరులో పాక్ గెలుపు
ట్రినిడాడ్: నాలుగు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా వెస్టిండీస్ తో ఇక్కడ హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్లో పాకిస్తాన్ మూడు పరుగుల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ ను 129 పరుగులకే కట్టడి చేసి స్వల్ప తేడాలో విజయాన్ని అందుకుంది. పాక్ విజయంలో లెగ్ స్పిన్నర్ షాదబ్ ఖాన్ నాలుగు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 132 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ చివరి వరకూ పోరాటం సాగించినా ఓటమి తప్పలేదు.
విండీస్ జట్టులో శ్యామ్యూల్స్(44), వాల్టాన్(21), జాసన్ హోల్డర్(26 నాటౌట్)లు ఫర్వాలేదనిపించినా ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.ప్రధానంగా చివరి ఓవర్లో విండీస్ విజయానికి 13 పరుగులు కావాల్సిన తరుణంలో సునీల్ నరైన్ బ్యాట్ ఝుళిపించాడు. వరుసగా రెండు బంతులను ఫోర్లగా మలిచి విజయంపై ఆశలు పెంచాడు. అయితే సింగిల్ తీసే ప్రయత్నంలో నరైన రనౌట్ గా పెవిలియన్ కు చేరడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి ఓటమి పాలైంది. దాంతో రెండో ట్వంటీ 20లోనూ విండీస్ పరాజయం పాలై సిరీస్ లో వెనుకబడింది.