
పాకిస్తాన్ క్లీన్ స్వీప్
అబుదాబి: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. బాబర్ ఆజమ్ (106 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా మూడో సెంచరీతో పాటు కెప్టెన్ అజహర్ అలీ (109 బంతుల్లో 101; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదడంతో చివరి వన్డేలో పాక్ 136 పరుగుల తేడాతో నెగ్గింది.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 308 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 44 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. రామ్‌దిన్ (37) టాప్ స్కోరర్. మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు (360) చేసిన ఆటగాడిగా ఆజమ్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు డికాక్ (342) పేరిట ఉండేది. అలాగే ఓవరాల్‌గా హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఎనిమిదో ఆటగాడిగా ఘనత సాధించాడు.