ఆమిర్పై పీసీబీ ఆగ్రహం!
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేళ్ల నిషేధం అనంతరం ఇటీవలే జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ క్రికెట్ బోర్డు పెద్దలకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ టీవీ షోకు ఆమిర్ ఇంటర్య్వూ ఇవ్వడమే వారి ఆగ్రహానికి కారణమైంది. గత కొన్నిరోజుల క్రితం పాక్ లోని ఓ టీవీ ఛానెల్కు ఆమిర్ ఇంటర్య్వూ ఇచ్చి ఇరకాటంలో పడ్డాడు. ఆటగాళ్లు మీడియాకు దూరంగా ఉండాలనే నిబంధనలు ఉన్నా, ఆమిర్ ఏమి ఆశించి అలా చేశాడో? అనే దానిపై పాక్ బోర్డులో చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్తో పాటు నజీమ్ సేథీలు అతన్ని పిలిపించి వివరణ అడిగారు. ఇక నుంచి మీడియాకు దూరంగా ఉండాలని , ఒకవేళ మీడియా ఎదురుపడినప్పుడు ఊహించిన ప్రశ్నలు ఎదురైనా కాస్త సంయమనం పాటించి సమాధానం చెప్పాలని ఆమిర్ కు సూచించారు. మరోసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆమిర్ ను మందలించారు.