
క్రికెటర్ ను ' దొంగ' అన్న మరో క్రికెటర్
కరాచీ: ఓ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెటర్లు తీవ్ర దూషణలకు దిగారు. ఖ్వైదా-ఈ-అజామ్ ట్రోఫీలో భాగంగా గురువారం సుయి సౌత్రన్ గ్యాస్-పీఐఏల మధ్య మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైన ఫైజల్ ఇక్బాల్, మహ్మద్ అమిర్ లు ఒకరి నొకరు దూషించుకున్నారు. క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది భాగంగా మారిపోయినప్పటికీ అమిర్ ను దొంగ (చోర్) అంటూ ఇక్బాల్ దూషించాడు. మ్యాచ్ జరుగుతుండగా తొలుత అమిర్ ను ఇక్బాల్ రెచ్చగొట్టారు. దీంతో అమిర్ కూడా ఘాటుగా స్పందించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక నియంత్రణ కోల్పోయిన ఫైజల్.. నువ్వు దొంగ అంటూ అమిర్ పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. తీవ్ర వివాదాన్ని రేపిన ఈ ఘటనలో ఆ క్రికెటర్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు.
2010లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా అమిర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల అమిర్ పై ఉన్న నిషేధాన్ని ఐసీసీతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఎత్తివేయడంతో అతను దేశవాళీ పోటీల్లో పాల్గొనడానికి క్లియరెన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే అమిర్ సుయి సౌత్రన్ గ్యాస్ జట్టు తరపున బరిలోకి దిగాడు. క్రికెట్ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అమిర్ 2016 వరకూ దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది.