అలా అయితే టీమిండియాతో మ్యాచ్ లు ఆడం!
కరాచీ: వచ్చే డిసెంబర్ లో యూఏఈలో పాకిస్థాన్ తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ రద్దయితే ఇక భవిష్యత్తులో టీమిండియాతో ఎటువంటి మ్యాచ్ లు ఆడబోమని పీసీబీ హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో సిరీస్ కు భారత క్రీడామంత్రిత్వ శాఖను నుంచి బీసీసీఐ ఎటువంటి అనుమతి కోరని పక్షంలో ఇక వారితో మ్యాచ్ లకు దూరంగా ఉంటామని షహర్యార్ ఖాన్ తెలిపారు.
'ఇరు దేశాల మధ్య యూఏఈలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ పై ఇంకా ఎటువంటి స్పషత రాలేదు. ఒకవేళ బీసీసీఐ ఆ సిరీస్ కు రావడానికి ఇష్టపడకపోతే.. వారితో ఇక మ్యాచ్ లు ఆడం. పీసీబీ నిరసన తెలపడానికి ఆ మార్గమే సరైంది. ఇరు దేశాల మధ్య ఐసీసీతో పాటు ఆసియా క్రికెట్ సమాఖ్య నిర్వహించే అన్ని మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తాం. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి ఆగస్టు 28 వ తేదీన బీసీసీఐకు ఒక లేఖ అందజేశాం. దానిపై స్పష్టత ఇవ్వాల్సి అవసరం బీసీసీఐకు ఉంది. మాతో క్రికెట్ ఆడతారా?లేదా? అనేది స్పష్టం చేయండి. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లేని కారణంగా సిరీస్ కు రాలేకపోతున్నామని బీసీసీఐ చెబితే.. ఆపై టీమిండియాతో మ్యాచ్ లకు జరగవు' అని షహర్యార్ ఖాన్ హెచ్చరించారు.